కేసీఆర్ తో మమత కటీఫ్: చంద్రబాబుకు ఆహ్వానం

By pratap reddyFirst Published Oct 10, 2018, 8:08 AM IST
Highlights

బిజెపికి వ్యతిరేకంగా తలపెట్టిన తృతీయ ప్రత్యామ్నాయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే ప్రాధాన్యం ఇవ్వాలని దీదీ నిర్ణయించుకున్నారు. కేసిఆర్ ను పక్కన పెట్టనున్నారు. 

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో దోస్తీని కటీఫ్ చేసుకున్నారు. బిజెపికి వ్యతిరేకంగా తలపెట్టిన తృతీయ ప్రత్యామ్నాయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే ప్రాధాన్యం ఇవ్వాలని దీదీ నిర్ణయించుకున్నారు. కేసిఆర్ ను పక్కన పెట్టనున్నారు. 

బిజెపికి వ్యతిరేకంగా కోల్ కతాలో తలపెట్టిన ర్యాలీకి ఆమె ఇప్పటికే చంద్రబాబుకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. కేసిఆర్ కు ఆహ్వానం పంపించలేదని సమాచారం. జనవరి 19వ తేదీన తలపెట్టిన ఆ ర్యాలీకి బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలను ఆహ్వానిస్తూ మూడు రోజుల క్రితం లేఖలు రాశారు. 

చంద్రబాబుకు ఆ అహ్వానం అందినట్లు తెలుస్తోంది. ర్యాలీకి హాజరు కావాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నరాు. బిజెపి, కాంగ్రెసు పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని గతంలో కేసిఆర్ తలపెట్టారు. ఆ సమయంలో ఆయన మమతా బెనర్జీని కలిసి తనతో కలిసి రావాలని కోరారు. 

అయితే, పరిస్థితులు మారిన నేపథ్యంలో కేసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరయ్యారు. కాంగ్రెసును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండు పార్టీలు ఖండిస్తున్నప్పటికీ టీఆర్ఎస్, బిజెపిల మధ్య రహస్య అవగాహన కుదిరిందనే అభిప్రాయమే బలంగా ప్రచారంలో ఉంది. 

ఎన్డీఎ నుంచి వైదొలిగి బిజెపికి దూరమైన తర్వాత చంద్రబాబు బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబును మమతా బెనర్జీ తనతో తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

వచ్చే లోకసభ ఎన్నికలకు ముందు బిజెపి వ్యతిరేక శక్తిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో జనవరి 19వ తేదీన కోల్ కతాలో ర్యాలీని తలపెట్టారు. ఈ ర్యాలీకి జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. 

click me!