చంద్రబాబుకు మమత ఆహ్వానం: కేసిఆర్ పై డైలమా

First Published Aug 3, 2018, 7:36 AM IST
Highlights

బిజెపి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును నిరీక్షణలో పెట్టారు.

న్యూఢిల్లీ: బిజెపి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును నిరీక్షణలో పెట్టారు. జనవరిలో తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ర్యాలీకి ఇప్పటికే ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు.

అయితే, కేసిఆర్ కు మాత్రం ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని సమాచారం. గతంలో కేసిఆర్, మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కొంత మంది ప్రాంతీయ పార్టీల నేతలను కలిసిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసిఆర్ మౌనం వహించారు. 

ఆ సమయంలో మమతా బెనర్జీ చురుగ్గా వ్యవహరించడం ప్రారంభించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు వచ్చే ఏడాది జనవరిలో తలపెట్టిన ర్యాలీకి ఆమె వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించడం మొదలు పెట్టారు. 

కాంగ్రెసుకు, బిజెపికి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానని కేసిఆర్ ప్రకటిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరైనట్లు భావిస్తున్నారు. కేవలం పది రోజుల సమాచారంతోనే మోడీ కేసిఆర్ కు, ఆయన కుమారుడు కేటిఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. దానికితోడు, ఇటీవల లోకసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ తటస్థ వైఖరిని అవలంబించింది. 

అంతేకాకుండా, మమతా బెనర్జీతో పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు తమతో కాంగ్రెసును కలుపుకుని వెళ్లాలని భావిస్తున్నారు. కేసిఆర్ మాత్రం కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ స్థితిలో మమతా బెనర్జీ తాను తలపెట్టిన ర్యాలీకి కేసిఆర్ ను పిలుస్తారా, లేదా అనేది సందేహంగానే ఉంది. 

చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీకి దగ్గరవుతున్నారు. దానికితోడు, కాంగ్రెసు నేతలతో వేదికను పంచుకోవడానికి ఆయన వ్యతిరేకత ప్రదర్శించడం లేదు. జనవరి 19వ తేదీన తలపెట్టిన ర్యాలీకి మమతా బెనర్జీ యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని, కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వారితో వేదికను పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చునని అంటున్నారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీ. అందువల్ల రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో కేసిఆర్ వేదికను పంచుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. 

click me!