Starvation Deaths: భార‌త్ లో ఆకలి చావులు.. కేంద్ర తీరుపై సుప్రీం కోర్టు అస‌హనం

By Rajesh KFirst Published Jan 18, 2022, 6:01 PM IST
Highlights

Starvation Deaths: ఆకలి చావులపై కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిలదీసింది. దేశంలో ఆకలితో మరణించిన వారి సంఖ్యపై తాజా స‌మాచారాన్ని ఇవ్వాలని, ఆకలితో పోరాడేందుకు జాతీయ స్థాయిలో మోడల్ స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. దేశంలో సంభ‌విస్తోన్న ఆక‌లి చావుల‌పై మంగ‌ళ‌వారం  చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచార‌ణ చేపట్టింది. ఆక‌లి చావులను అరిక‌ట్ట‌డంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
 

Starvation Deaths: ఆకలి చావులపై కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) నిలదీసింది. దేశంలో ఆకలితో మరణించిన వారి సంఖ్యపై తాజా స‌మాచారాన్ని ఇవ్వాలని, ఆకలితో పోరాడేందుకు జాతీయ స్థాయిలో మోడల్ స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. దేశంలో సంభ‌విస్తోన్న ఆక‌లి చావుల‌పై మంగ‌ళ‌వారం  చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచార‌ణ చేపట్టింది. ఆక‌లి చావులను అరిక‌ట్ట‌డంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఆకలి మరణాలపై  2015-2016 నివేదిక (report on starvation deaths) ను సమ‌ర్పించడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా మండిపడింది. ‘దేశంలో ఒక్కటి తప్ప ఆకలి చావులు లేవని మీరు చెబుతున్నారా? ఆ ప్రకటనపై మనం ఆధారపడగలమా? అని ప్ర‌శ్నించింది. "రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలి మరణాలను నివేదించనందున, దేశంలో ఆకలి చావులు లేవని అర్థం చేసుకోవాలా? అని నిలదీసింది. ఆకలి  మ‌ర‌ణాల‌పై కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారంతో నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. స‌రైన స‌మాచారం కోసం సంబంధిత అధికారులను అడిగి సమాచారం సేకరించండని కేంద్ర తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించారు.
  
ఐదు రాష్ట్రాల్లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయని, కమ్యూనిటీ కిచెన్‌ల విధానం వల్ల కేంద్రం ప్రజాదరణ పొందుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.  ఇది ఎన్నికల సమయం.. మీరు పాలసీని రూపొందించి, అదనపు ఆహార ధాన్యాలు అందజేస్తే , అప్పుడు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నాయ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. 

 134 పథకాలు అమలులో ఉన్నాయని, ఇప్పటికే ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నందున ఎక్కువ నిధులను రాష్ట్రాలకు మళ్లించలేమని వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు.అదనపు ఆహార ధాన్యాలను అందించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం కేంద్రానికి తెలిపింది.  
రాష్ట్రాలు, ఇతర వాటాదారులతో సంప్రదించి, అదనపు లాజిస్టిక్స్, వనరులు, ఆహార ధాన్యాలను విస్తరించడానికి వీలుగా కమ్యూనిటీ కిచెన్‌ల కోసం జాతీయ నమూనా పథకాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది,  


‘‘దేశంలో ఏ ఒక్క‌రూ ఆకలితో బాధపడకూడదు, ఆకలితో చనిపోకూడదు..  అనేది దృష్టిలో  పెట్టుకుని.. ఓ నోడల్ పథకాన్ని రూపొందించాలని, ఈ ప‌థ‌కం రూప‌క‌ల్ప‌న కోసం సంబంధిత‌ అధికారులతో చర్చించాలని సుప్రీం పేర్కొంది. తాము కోర్టు ఉద్దేశాన్ని వివరించామనీ,  పరిష్కారాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. 

పోషకాహార లోపం అనే పెద్ద సమస్యలపై మేము చెప్పడం లేదు. ఆకలి తీర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య ఉందని అంగీకరిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించండి. మీ అధికారులను వారి మనసుతో ఆలోచించమని కోరండి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఆకలి చావుల‌ను అరిక‌ట్ట‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏమీ చేయడం లేదని చెప్పడం లేదనీ,  కానీ జాతీయ స్థాయిలో ఒక నమూనా పథకాన్ని రూపొందించి..  దానిని ఆమోదించి.. ఆపై దానిని రాష్ట్రాలకు వదిలివేయండ‌ని  ప్రధాన న్యాయమూర్తి అన్నారు. 

దీనిపై స్పందించిన అటార్నీ జనరల్ కోర్టు సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. ఈ సూచ‌న‌ల‌తో ఒక పథకాన్ని తయారు చేయవచ్చు.. రెండు శాతం అదనపు ఆహార ధాన్యాలు రాష్ట్రాలకు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయనివ్వండి. ఈ రెండు శాతం అన్ని రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉందో లేదో చూద్దాం..అని ఆయన పేర్కొన్నారు. ఈ విష‌యంపై త‌రువాత విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..  పౌష్టికాహార లోపం, ఆకలి తదితర సమస్యలపై రాష్ట్రాలు అదనపు అఫిడవిట్‌లను దాఖలు చేయవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. 

click me!