Uddhav Thackeray: మనస్ఫూర్తిగా మీరంతా శివసైనికులే.. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు ఉద్ధ‌వ్ థాక్రే భావోద్వేగ లేఖ‌

By Mahesh RajamoniFirst Published Jun 28, 2022, 4:55 PM IST
Highlights

Maharashtra: నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను కోరారు. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు రాసిన బహిరంగ లేఖ‌లో భావోద్వేగ వ్యాఖ్య‌లు చేశారు. 
 

Maharashtra political crisis: మ‌హారాష్ట్రలో రాజ‌కీయం సంక్షోభం కొన‌సాగుతోంది. రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. దీంతో పొలిటిక‌ల్ హీట్ కాక‌రేపుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ థాక్రే.. మీరు ఇప్పటికీ మనస్ఫూర్తిగా శివసేనతో ఉన్నారు. మీరంతా శివ‌సేన సైనికులే.. రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పేర్కొన్నారు. అసోంలోని గౌహతిలోని ఓ స్టార్ హోట‌ల్ లో బస చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు రాసిన ఓ బ‌హిరంగా లేఖ‌లో ఉద్ధ‌వ్ థాక్రే భావోద్వేగ వ్యాఖ్య‌లు చేశారు. తిరుగుబాటు తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వ‌చ్చిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, మంత్రి ఏక్‌నాథ్ షిండేతో క‌లిసి త్వరలో తిరిగి ముంబయి రానున్నార‌నే ప్ర‌క‌ట‌న క్ర‌మంలో ఉద్ధ‌వ్ ఈ లేఖ రాశారు. 

"శివసేన కుటుంబానికి అధిపతిగా, నేను మీ గురించి ఆందోళన చెందుతున్నాను. గత కొన్ని రోజులుగా మీరు లాక్‌లో ఉన్నారు. మీ గురించి ప్రతిరోజూ కొత్త సమాచారం వస్తుంది.  మీరు అంద‌రూ గత కొద్దిరోజులుగా గౌహతి హోటల్‌లో చిక్కుకుపోయారు. చాలామందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. మనస్ఫూర్తిగా మీరంతా శివసైనికులే. మీ కుటుంబ సభ్యులు కొందరు నన్ను సంప్రదించారు. వారి భావోద్వోగాలను కూడా నాతో పంచుకున్నారు. శివసేన కుటుంబ పెద్దగా మీ అందరి మనోభావాల పట్ల నాకు గౌరవం ఉంది'' అని ఉద్ధ‌వ్ థాక్రే త‌న లేఖ‌లో పేర్కొన్నారు. రెబల్ క్యాంప్ నాయకుడిగా చెప్పుకుంటున్న ఏక్‌నాథ్ షిండేను పరోక్షంగా ఉద్ధవ్ ప్రస్తావిస్తూ, ఎవరో చేసిన పొరపాటుకు వారి వలలో చిక్కుకోవద్దని రెబల్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. 

శివసేన ఇచ్చిన గౌరవం ఇంకెక్కడా దొరకదని పేర్కొన్నారు. ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మీరు ముందుకు వ‌చ్చి మాట్లాడి ప‌రిష్క‌రించుకోవాల‌ని రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు సూచించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న గందరగోళానికి స్వస్తి ప‌ల‌కాల‌ని కోరారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌కు తప్పనిసరిగా ప‌రిష్కార మార్గాలు ఉన్నాయ‌ని తెలిపారు. మ‌నంద‌రం దీని గురించి మాట్లాడుకుందామ‌ని పిలుపునిచ్చారు. అనంత‌రం ఒక అవగాహనకు వద్దామ‌ని పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు టచ్‌లోకి వచ్చి 'సెంటిమెంట్స్' గురించి తనకు తెలియజేశారని  ఉద్ధ‌వ్ థాక్రే చెప్పారు. "మీ మనోభావాలను నేను గౌరవిస్తాను. అధినేతగా నేను ఇప్పటికీ హృదయపూర్వకంగా చెబుతున్నాను. ఇప్ప‌టికీ స‌మయం మించిపోలేదు. నా ముందు కూర్చోవాలని, ప్రజలలో మరియు శివసైనికుల [పార్టీ కార్యకర్తల] మదిలో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మేము కలిసి కూర్చుని ఒక మార్గం కనుగొంటాము. శివసేన మీకు ఇచ్చిన గౌరవం మీకు మరెక్కడా దొరకదు ”అని  పేర్కొన్నారు. 

ఇదిలావుండ‌గా, అంతకుముందు రోజు షిండే తన గ్రూపులోని 20 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని పార్టీతో టచ్‌లో ఉన్నారనే వాదనలను తోసిపుచ్చారు. ఈ ఎమ్మెల్యేలంతా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సొంతంగా ఇక్కడికి వచ్చారు అని ఎక్‌నాథ్‌ షిండే చెప్పారు. 30 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేల మద్దతును ప్రకటించిన ఏక్‌నాథ్ షిండే, శివసేన నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలైంది. NCP మరియు కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సేనలో తిరుగుబాటు మూడు పార్టీల పాలక సంకీర్ణాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. తిరుగుబాటు శివ‌సేన శాసనసభ్యులకు ఉపశమనం కలిగించే విధంగా, సుప్రీం కోర్టు సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ముందు అనర్హత ప్రక్రియను జూలై 11 వరకు నిలిపివేసింది. వారి అనర్హతను కోరుతూ నోటీసుల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేల అభ్యర్థనలకు ప్రతిస్పందనలను కోరింది.

click me!