మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌కు వరుస షాక్‌లు.. షిండే‌ శిబిరం‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. శివసేన చీలిక తప్పదా?

By Sumanth KanukulaFirst Published Jun 23, 2022, 10:56 AM IST
Highlights

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు వరుస షాక్‌లు తగులతున్నాయి. శివసేన కీలక నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో తలెత్తిన రాజకీయ సంక్షోభం.. కీలక మలుపులు తిరుగుతుంది. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు వరుస షాక్‌లు తగులతున్నాయి. శివసేన కీలక నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో తలెత్తిన రాజకీయ సంక్షోభం.. కీలక మలుపులు తిరుగుతుంది. ఏక్‌నాథ్ షిండే‌కు మద్దతిస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరగుతుంది. దీంతో శివసేన‌లో చీలక ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన‌కు ప్రస్తుతం 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా..  పార్టీ తమదిగా ప్రకటించుకోవాలంటే ఏక్‌నాథ్‌ షిండేకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుందని పలు ఆంగ్ల మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

అయితే ఇప్పటికే 30కు పైగా శివసేన ఎమ్మెల్యేలు షిండే‌కు మద్దతుగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం శివసేనకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు..  ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరారు. దీపక్ కేశకర్ (సావంత్‌వాడి నుంచి ఎమ్మెల్యే), మంగేష్ కుడాల్కర్ (చెంబూర్ నుంచి ఎమ్మెల్యే) ,సదా సర్వాంకర్ (దాదర్ నుంచి)లు ఈ రోజు ఉదయం ముంబై నుంచి గౌహతికి విమానంలో చేరుకున్నారు. దీంతో ఏక్‌నాథ్ షిండే శిబిరంలోని శివసేన ఎమ్మెల్యేల సంఖ్య 36కి చేరిందని కథనాలు వెలువడుతున్నాయి. 

ఫిరాయింపుల నిరోధక చట్టాల కింద అనర్హత వేటు పడకుండా శివసేన పార్టీని చీల్చేందుకు షిండే శిబిరానికి ఇప్పుడు కేవలం ఒక్కరే కావాలి. ఒకవేళ ఇదే జరిగితే శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే.. మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంతో పాటు, పార్టీని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఏక్‌నాథ్ షిండే వెంట ఉన్నారు.

ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో శివసేన కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, శరద్ పవార్ నేత్వతంలోని ఎన్‌సీపీలు పాలక కూటమిని చుట్టుముట్టిన భారీ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు రెబల్ నాయకుడు ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా నియమించాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

రాజీనామ లేఖ సిద్దంగా ఉంది.. ఉద్దవ్ ఠాక్రే..
తాను బాల్‌ ఠాక్రే కుమారుడినని.. అధికారం కోసం ఎన్నటికీ పాకులాడనని ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదని చెప్పారు. బుధవారం ఆయన ఆన్‌లైన్ వేదికగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై స్పందించారు.  తాను సీఎంగా ఉండటం ఒక్క శివసేన ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పినా రాజీనామా చేస్తానని చెప్పారు. ఎక్కడో ఉండి ప్రకటనలు చేయడం దేనికని.. శివసేన అధ్యక్షపదవి, సీఎం పదవి చేపట్టడానికి అనర్హుణ్ని అని తన ముందుకొచ్చి చెప్పాలని సూచించారు. సీఎం పదవికి తాను తగనని తన పార్టీవాళ్లే అంటే రాజీనామా చేయడానికి సిద్ధమేనని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. అలా చెబితే వెంటనే రాజీనామా చేస్తానని.. రాజీనామా లేఖ కూడా సిద్దంగా ఉంచుకున్నట్టుగా చెప్పారు. 

అయితే ఆ తర్వాత  శివసైనికులే సీఎం అవుతారన్న గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. శివసైనికులే సీఎం అయితే తాను సంతోషిస్తానన్నారు.  తనకు అనుభవం లేకున్నా ప్రభుత్వం నడపడానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీకి, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌కు, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉద్దవ్ ఠాక్రే.. మలబార్ హిల్స్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్ష’ నుంచి బాంద్రాలోని తన నివాసం మాతోశ్రీ‌కి చేరుకున్నారు.

అదే సమయంలో.. శివసేన ప్రధాన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయరని, అవసరమైతే అధికార మహా వికాస్ అఘాడి (MVA) అసెంబ్లీలో తన మెజారిటీని రుజువు చేసుకుంటుందని పేర్కొన్నారు. 

మరోవైపు శివసేన తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏకనాథ్ షిండే..  పాలక కూటమి భాగస్వాములకు మాత్రమే ప్రయోజనకరంగా ఉందని ఆరోపించారు., గత రెండున్నరేళ్ల సంకీర్ణ పాలనలో  శివసైనికులు ఎక్కువగా నష్టపోయారని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం’’ అని ట్వీట్ చేశారు. 


 

click me!