సరిహద్దు వివాదం: నాలుకను అదుపులో పెట్టుకో.. సంజయ్‌ రౌత్‌కు మంత్రి దేశాయ్‌ వార్నింగ్‌..

By Rajesh KarampooriFirst Published Dec 7, 2022, 7:50 PM IST
Highlights

మరోసారి విశ్రాంతి తీసుకోకుండా ఉండాలంటే నాలుకను అదుపులో పెట్టుకోవాలని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ రౌత్‌ను మహారాష్ట్ర మంత్రి శంభురాజ్‌ దేశాయ్‌ పరోక్షంగా హెచ్చరించారు. మనీలాండింగ్‌ కేసులో బెయిల్‌పై ముంబయి జైలు నుంచి రౌత్‌ నవంబర్‌ 9న విడుదలైన విషయం తెలిసిందే.

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ పై మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి విశ్రాంతి తీసుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే నాలుకను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించడంతో రౌత్ గత నెలలో ముంబై జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై  సంజయ్ రౌత్ స్పందిస్తూ..  దేశాయ్ ప్రకటనను బహిరంగ బెదిరింపుగా పేర్కొన్నాడు.

మౌనంగా ఉండమని, లేకుంటే జైలుకు పంపుతానని దేశాయ్ బెదిరించాడని రౌత్ ఆరోపించారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బవాన్‌కులే కూడా ఇదే భాష మాట్లాడుతారని రౌత్ విమర్శించారు. కర్నాటకలోని బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని రౌత్ బుధవారం డిమాండ్ చేశారు. 'ఢిల్లీ' మద్దతు లేకుండా బెలగావిలో హింసాత్మక సంఘటనలు జరిగేవి కాదని రౌత్ ఆరోపించారు. ఈ దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా, నిస్సహాయంగా చూస్తోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి రౌత్ అన్నారు. మహారాష్ట్రను అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు సంజయ్ రౌత్‌పై ఎక్సైజ్ మంత్రి దేశాయ్ మండిపడ్డారు. సరిహద్దు వివాదం మధ్య బెలగావిని సందర్శించిన మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మంత్రుల్లో దేశాయ్ ఒకరు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంజయ్ రౌత్‌పై విమర్శలు గుప్పించారు. “ మీకు (రౌత్) బయట వాతావరణం సరిపోవడం లేదనిపిస్తోంది. మళ్లీ విశ్రాంతి తీసుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. మీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి“ అని సూచించారు. ఎన్‌సిపి నాయకుడు శరద్ పవార్ నాయకత్వంలో తాను బెలగావికి వెళ్తానని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు రౌత్ చెప్పారని దేశాయ్ పేర్కొన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి తలవంచిన సంజయ్ రౌత్‌ను నమ్మవద్దని ఉద్ధవ్‌జీని ఇప్పటికే హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.

దేశాయ్‌పై ఎదురుదాడి చేస్తూ సంజయ్ రౌత్ ట్వీట్ చేస్తూ.. "మిస్టర్, ఇది బహిరంగ బెదిరింపునా? మన గర్వకారణం అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తుండగా.. మహారాష్ట్ర కోసం గళం విప్పుతున్న వారిని శత్రువులుగా చూస్తున్నారు. చట్టం,న్యాయవ్యవస్థ ఒత్తిడికి లోనవుతుందనడానికి ఇది నిదర్శనం. కానీ, ప్రజలు మౌనంగా ఉండరు. నిజాలు మాట్లాడే వారిని జైలుకు పంపుతారనేది ఇప్పటికిప్పుడు స్పష్టమైంది" అని పేర్కొన్నారు. సబర్బన్ గోరేగావ్‌లోని హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆగస్టు 1న ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే

click me!