
బాలీవుడ్ నటుడు , దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నేటికీ మిస్టరీగానే వున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ కేసుకు సంబంధించని సాక్ష్యాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని.. ఇప్పటి వరకు వాళ్లూ వీళ్లు చెప్పిన సమాచారమే వుందని ఫడ్నవీస్ చెప్పారు. ఆ తర్వాత కొంతమంది బలమైన సాక్ష్యాలు వున్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో వారి వద్ద వున్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరామని.. తర్వాత ప్రాథమిక సాక్ష్యాలను సేకరించామని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న దశలో కేసు గురించి మరిన్ని వివరాలు చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.
కాగా.. స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే సుశాంత్ సింగ్ ఫ్యాన్ కు ఉరేసుకోవడం ఇండస్ట్రీని ఉల్కిక్కి పడేలా చేసింది. 2020 జూన్ 14న తన గదిలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోవడం సంచలనంగా మారింది. అతని మరణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి బదిలీ చేయడానికి ముందు ముంబై పోలీసులు దర్యాప్తు చేశారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిని కూడా అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే.
ALso Read: ‘దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్యే’.. షాకింగ్ విషయాలను వెల్లడించిన డాక్టర్!
ఇదిలావుండగా.. రెండేళ్లైనా అసలు విచారణ పూర్తి కాకపోవడంతో తాజాగా ముంబైలోని కూపర్ ఆస్పత్రి ఎంప్లాయి డాక్టర్ రూప్ కుమార్ షా సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘సుశాంత్ సింగ్ మరణించడంతో.. పోస్టుమార్ట నిమిత్తం ఆయన బాడీని కూపర్ ఆస్పత్రికి పంపించారు. అదే సమయంలో మరో నాలుగు డెడ్ బాడీలు అందాయి. మొత్తం ఐదు బాడీలు రాగా.. అందులో ఒకటి వీఐపీది అని చెప్పారు. పోస్టుమార్టం చేసేందుకు వెళ్లినప్పుడే ఆయన్ని గుర్తుపట్టాం. తన శరీరంపై అనేక గుర్తులు కూడా ఉన్నాయి. మెడపై రెండు, మూడు గుర్తులున్నాయి.
అయితే, పోస్టుమార్టం సమయంలో కేవలం ఫొటోలు మాత్రమే తీయాలని పైఅధికారులు కోరారు. అందుకే అలా చేశాం. ఆ తర్వాత సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. హత్యేనని కూడా ఆఫీసర్లకు చెప్పాం. కానీ వారు నిబంధనలకు ప్రకారం పనిచేయాలని చెప్పారు. వెంటనే మా సీనియర్స్ కూ చెప్పిన ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా.. త్వరగా ఫొటోస్ తీసి బాడీని తమకు అప్పగించాలని పోలీసులు చెప్పడంతో.. రాత్రిపూటనే పోస్టుమార్టం చేశాం.’ అంటూ డాక్టర్ చెప్పిన సంచలన విషయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.