Maharashtra Crisis: బలపరీక్ష నిర్వ‌హించాలని మాజీ సీఎం డిమాండ్.. 'మ‌హా' గ‌వ‌ర్న‌ర్ కు లేఖ 

By Rajesh KFirst Published Jun 29, 2022, 2:54 AM IST
Highlights

Maharashtra Crisis: మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం సాయంత్రం గవర్నర్ బీఎస్ కోష్యారీతో భేటీ అయ్యారు. ఈ త‌రుణంలో ఉద్ధవ్ ఠాక్రే తన మెజారిటీని నిరూపించుకోవాలని, బలపరీక్ష నిర్వ‌హించాల‌ని  కోరుతూ లేఖ అందజేశారు 

Maharashtra Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు సుప్రీం తాత్కాలికంగా కాస్త ఊర‌టనివ్వ‌డంతో మ‌రింత ఉత్కంఠ భ‌రితంగా మారింది. మరో వైపు శివసేన  నేతృత్వంలోని సంకీర్ణ కూటమి మహా వికాస్ అగాడీ అసెంబ్లీలో మెజార్టీ కోల్పోగా.. మ‌రో వైపు తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. ఈ త‌రుణంలో మహారాష్ట్రలో అధికారం తమదేంటూ బీజేపీ నాయకులు చెబుతున్నారు. మ‌రోవైపు రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేక‌పోలేద‌నే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం సాయంత్రం గవర్నర్ బీఎస్ కోష్యారీని కలిసి బలపరీక్ష కోరుతూ లేఖ అందజేశారు.ఈ క్ర‌మంలో మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిశారు. బలపరీక్ష (ఫ్లోర్ టెస్ట్) చేయాల‌ని డిమాండ్ లేవ‌నెత్తారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ కు లేఖ అందజేశారు. ఎమ్మెల్యే చంద్రకాంత్‌పాటిల్‌, గిరీష్‌ మహాజన్‌, ఇతర నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు. 

గవర్నర్‌తో భేటీ అనంత‌రం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌కు లేఖ ఇచ్చామని, బలపరీక్ష జరపాలని డిమాండ్‌ చేశామన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలిస్తే.. ప్రభుత్వం మైనారిటీలో ఉన్నట్లు కనిపిస్తోందని గవర్నర్‌కు చెప్పామని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. కావున వెంటనే సీఎం బలపరీక్ష నిర్వహించి మెజారిటీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించండి. ఈమెయిల్ ద్వారా, నేరుగా గవర్నర్‌కు లేఖ ఇచ్చామని తెలిపారు.

గవర్నర్‌కు రాసిన లేఖలో ఫడ్నవీస్ ఇలా పేర్కొన్నారు, “గత 8-9 రోజుల నుంచి శివసేన నేతల్లో అసమ్మ‌తి కనిపిస్తోంది. శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌లతో పొత్తు వద్దని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అసెంబ్లీలో మెజారిటీ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గౌహతిలో ఉన్న‌శివసేన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. గౌహతి నుంచి 40 శవాలు తిరిగి వస్తాయని శివసేన నేత సంజయ్ రౌత్ హెచ్చరిస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, సభా వేదికపై మెజారిటీ చాలా ముఖ్యం.. మెజారిటీ లేకుంటే.. ప్రభుత్వం ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. కావున ముఖ్యమంత్రి మెజారిటీ నిరూపించుకోమని కోరవలసిందిగా కోరుతున్నాం.  ఈ లేఖతో పాటు కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను జత చేస్తున్నాను, ”అని ఫడ్నవిస్ పేర్కొన్నాడు. 

ఇదిలాఉంటే.. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున ఢిల్లీ వెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి బీజేపీ మహారాష్ట్ర యూనిట్ కోర్ కమిటీ సమావేశం జ‌రిగినట్టు తెలుస్తోంది.  ఢిల్లీలో ఆయన అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ కోటా మంత్రులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రభుత్వం ఏర్పాటైతే సీఎం పదవి బీజేపీదే...!

ఈ సమావేశంలో న్యాయవాది, రాజ్యసభ ఎంపీ మహేశ్ జెఠ్మలానీ హాజరైన‌ట్టు తెలుస్తోంది. నేతల మధ్య న్యాయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి చట్టపరమైన సమాచారాన్ని హోంమంత్రి అమిత్ షా ముందు ఉంచారట‌. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి భాజపాకే దక్కుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు 28 మంది మంత్రులు కూడా బీజేపీకే రానున్నాయి.

జేపీ నడ్డాతో ఫ‌డ్న‌వీస్ భేటీ

ఆ తర్వాత.. దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైకి తిరిగి వచ్చారు. అదే సమయంలో, అతను ఇప్పుడు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలుసుకున్నాడు మరియు బలపరీక్షను డిమాండ్ చేశాడు.  ఇదిలా ఉండగా, గౌహతిలోని హోటల్ రాడిసన్ బ్లూలో రెబల్ ఎమ్మెల్యేలందరితో అత్యవసర సమావేశానికి ఏక్నాథ్ షిండే పిలుపునిచ్చారు.

click me!