మా టార్గెట్ మోదీని గద్దె దించడమే: నెక్స్ట్ మీటింగ్ ఏపీలోనే..?

By Nagaraju TFirst Published 19, Jan 2019, 5:52 PM IST
Highlights

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని బీజేపీ వ్యతిరేక కూటమి అభిప్రాయం వ్యక్తం చేసింది. కోల్ కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో నిర్వహించిన బీజేపీ యేతర పార్టీల ఐక్యత ర్యాలీ విజయవంతంగా ముగియడంతో పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. 

కోల్ కతా: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని బీజేపీ వ్యతిరేక కూటమి అభిప్రాయం వ్యక్తం చేసింది. కోల్ కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో నిర్వహించిన బీజేపీ యేతర పార్టీల ఐక్యత ర్యాలీ విజయవంతంగా ముగియడంతో పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. 

దేశంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు కలిసి పనిచెయ్యాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వానికి ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయయని వాటిని పునరుద్ధరించాలంటే విపక్షాల కూటమి అధికారంలోకి రావడంతోనే సాధ్యమన్నారు. 

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తాము ప్రజలకు సేవకులం కానీ మోదీకి కాదన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిందని పశ్చిమబంగ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

 మోదీని విభేదించేవారిని అణగదొక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీని గద్దెదించడమే తమ లక్ష్యమని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్ అబ్ధుల్లా స్పష్టం చేశారు. మోడీ అన్ని వ్యవస్థలను నీరుగారుస్తున్నారని విరుచుకుపడ్డారు.   
 
అటు మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా ఏకమై మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సూచించారు. అన్ని పార్టీలు కలిసి భవిష్యత్ కార్యచరణ ప్రకటించాలన్నారు. ప్రజలకు సుస్థిర పాలన అందిస్తామన్న హామీని  ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 

మరోవైపు కేంద్రం తీరుకు నిరసనగా భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. రాబోయే రోజుల్లో ఏయే అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ముందుకు వెళ్లాలో అన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. రూట్ మ్యాప్ రూపకల్పనపైనా చర్చించారు. 

కేంద్రం తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాతి సభ కర్ణాటకలో నిర్వహించాలా...ఏపీలో నిర్వహించాలా అన్న అంశాలపై చర్చించారు. 

మరోవైపు యునైటెడ్ ర్యాలీ ముగింపు సభలో పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం గడువు ఇక ముగిసిపోయిందని, త్వరలోనే మోదీని సాగనంపుతారని జోస్యం చెప్పారు. 

తాము అవినీతి రహితంగా ఉన్నామని మోదీ చెప్తున్నారని కానీ ఆయన హయాంలో రఫేల్‌ లాంటి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగాయని గుర్తు చేశారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో మోదీ లక్ష్మణరేఖ దాటారని ఆరోపించారు. 

మోదీతో కలిసి ఉన్నంత వరకు బాగానే ఉంటాదని విడిపోతే అణగదొక్కే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, అఖిలేశ్‌, మాయావతి సహా ఎవర్నీ వదల్లేదన్నారు. ఎవరినీ వదల్లేనప్పుడు మనం మోదీని ఎందుకు వదలాలి అని నిలదీశారు. బీజేపీ ప్రతి ప్రభుత్వ సంస్థను అవమానించిందని, సీబీఐ, ఈడీని కూడా వదల్లేదని దుయ్యబట్టారు. 

ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఈసారి ప్రజలు బీజేపీకి ఓటేస్తే వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న కాస్త డబ్బు కూడా తిరిగి రాదని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని, అసలు ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్లు ఇవ్వడంలో అర్థమేంటని ప్రశ్నించారు. 

బీజేపీ హాయంలో మంచి రోజులే రాలేదని విమర్శించారు. నవ భారతాన్ని నిర్మించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయని మమత జోస్యం చెప్పారు. ప్రధాని ఎవరన్నదానిపై తాను ఆలోచించడం లేదని బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని దీదీ స్పష్టం చేశారు. 

Last Updated 19, Jan 2019, 5:52 PM IST