కిరణ్ బేడీకి చుక్కెదురు: మీ జోక్యం అవసరం లేదన్న మద్రాస్ హై కోర్టు

By Nagaraju penumalaFirst Published Apr 30, 2019, 3:02 PM IST
Highlights

పాలనకు సంబంధించిన రోజువారీ అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం కిరణ్‌బేడీకి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆర్థిక, పాలన, సేవలకు సంబంధించిన వ్యవహారాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు లేదని, అలాంటి విషయాల్లో కేబినెట్ ను సంప్రదించి సలహాలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 

చెన్నై: మద్రాస్ హైకోర్టులో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి చుక్కెదురైంది.  ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు కీలక విషయాల్లో ఆమె స్వతంత్రంగా వ్యవహరించే అధికారం కూడా లేదని హై కోర్టు స్పష్టం చేసింది. 

లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను ప్రశ్నిస్తూ పుదుచ్చేరి కాంగ్రెస్ ఎహ్మెల్యే లక్ష్మీనారాయణ 2017లో మద్రాస్ హై కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టులోని మదురై బెంచ్ మంగళవారం తీర్పు వెల్లడించింది. 

పాలనకు సంబంధించిన రోజువారీ అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం కిరణ్‌బేడీకి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆర్థిక, పాలన, సేవలకు సంబంధించిన వ్యవహారాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు లేదని, అలాంటి విషయాల్లో కేబినెట్ ను సంప్రదించి సలహాలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 

ఇకపోతే పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించొచ్చని, కీలక నిర్ణయాల్లో మంత్రిమండలిని సంప్రదించాల్సిన అవసరం లేదని రెండేళ్ల క్రితం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కిరణ్‌బేడీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామిలమధ్య విభేదాలు నెలకొన్నాయి. 

అనంతరం ఓ ప్రైవేటు మెడికల్‌ కళాశాల ప్రవేశాల్లో జరిగిన కుంభకోణం వ్యవహారంలో కిరణ్ బేడీ జోక్యం చేసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కిరణ్ బేడీ కళాశాలలో తనిఖీలు చేపట్టడంతోపాటు ప్రభుత్వ దస్త్రాలను పరిశీలించడంపై మండిపడింది. 

దీంతో ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ ల మధ్య విబేధాలు కాస్త తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు లేదని తేల్చి చెప్పింది. మద్రాస్ హై కోర్టు తీర్పుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. 

click me!