లంచాలు తీసుకోవడం తప్పేమీ కాదు.. అయితే దానికో లెక్క ఉండాలే.. అధికారులకు ఆ నేత క్లాస్

By telugu teamFirst Published Sep 28, 2021, 8:17 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే అధికారులకు లంచంపై క్లాస్ తీసుకున్నారు. లంచాలు తీసుకోవడం తప్పేమీ కాదని, కానీ, దానికో లెక్క ఉండాలని అన్నారు. ఇష్టపూర్వకంగా రూ. 500 నుంచి 1000 ఇస్తే పుచ్చుకోవచ్చునని, కానీ, కష్టపడి సంపాదించిన వారి సంపాదన నుంచి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని సూచనలు చేశారు.
 

భోపాల్: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఓ రాజకీయ నేత లంచాల(Bribe)పై స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. లంచాలు తీసుకోవడం తప్పేమీ కాదని, కానీ, దానికి ఓ లెక్క ఉండాలని సూచించారు. ఎంత మేరకు పుచ్చుకోవడం ఆమోదయోగ్యమని ఆమె కొన్ని వివరాలు చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దమోహ్ జిల్లాలోని పథారియా ఎమ్మెల్యే రమాబాయి సింగ్ లంచంపై మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనా కింద ఇళ్లు కేటాయించడానికి జిల్లా అధికారులు లంచాలు అడుగుతున్నారని సతౌవా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆమె గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి బాధితులను, లంచం పుచ్చుకున్న అధికారులనూ పిలిపించింది. ఆ గ్రామస్తులు ఎంతెంత లంచం ఇచ్చారని అడిగారు. ఓ ముగ్గురు లేచి రూ. 9000, రూ. 5000, రూ. 6000లు ఇచ్చినట్టు తెలిపారు.

‘మీరు రూ. 1000 లంచం తీసుకుంటే బాధేమీ లేదు. చపాతీ చేస్తున్నప్పుడ గోధుమ పిండిలో ఉప్పు కలిపే స్థాయిలో లంచం తీసుకోవడం తప్పేమీ కాదు. అంతేకానీ, ఎదుటివారి మొత్తం ప్లేట్ లాక్కునేలా ఉండకూడదు. నాకు తెలుసు మతితప్పిన వారి పాలనలో ఉన్న రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులున్నాయి. కానీ, మీరు పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఈ కార్మికులంతా పనిచేసుకుని పొట్టపోసుకుంటారు. వారి ఇళ్లకు ఎంత ఖర్చవుతుంది. మహా అయితే రూ. 1.20 లక్షలు ఖర్చవుతుంది. ఆ మొత్తం మీ బాత్‌రూమ్ నిర్మాణాలకు అయ్యే ఖర్చుతో సమానం’ అని అధికారులకు సూచించారు.

గతంలోనూ ఎమ్మెల్యే రమాబాయి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి లంచాలు తీసుకున్న అధికారుల నుంచి డబ్బును తిరిగి వెనక్కి అప్పజెప్పించారు. తాజా ఘటన వైరల్ కావడంతో ఆమె వివరణ ఇచ్చారు. వారి ఇష్టపూర్వకంగా రూ. 500 నుంచి రూ. 1000 వరకు లంచం ఇస్తే తప్పేమీ లేదని, పంటపొలాల్లో చెమటను చిందించి డబ్బును లంచంగా గుంజుకోవద్దని అన్నారు.

click me!