ప‌శువులను బలిగొంటున్న చ‌ర్మ‌వ్యాధి.. ఆందోళనలో రైతులు.. మహమ్మారిగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం డిమాండ్

Published : Aug 19, 2022, 04:06 PM IST
ప‌శువులను బలిగొంటున్న చ‌ర్మ‌వ్యాధి.. ఆందోళనలో రైతులు.. మహమ్మారిగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం డిమాండ్

సారాంశం

lumpy skin disease: ఆవులకు వచ్చే చర్మవ్యాధి (లంపీ స్కీన్ డిసీజ్) ని  మహమ్మారిగా ప్ర‌క‌టించండి అని రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివ‌ర‌కు రాష్ట్రంలో 22,000 కంటే ఎక్కువ ప‌శువులు.. అధికంగా ఆవులు ఈ చర్మ వ్యాధి కారణంగా మ‌ర‌ణించాయి.  

రాజస్థాన్: దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ప‌శువుల చ‌ర్మ వ్యాధి (లంపీ స్కీన్ డిసీజ్) విజృంభ‌ణ కొన‌సాగుతోంది. వేల సంఖ్య‌లో ప‌శువులు దీని బారినప‌డి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో ఈ అంటువ్యాధి ప‌రిస్థితుల‌ను దారుణంగా మార్చింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉత్త‌ర‌భార‌తంలోని చాలా రాష్ట్రాల్లో లంపీ స్కీన్ డిసీజ్ వ్యాప్తి క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో "ఆవులకు వచ్చే చర్మవ్యాధి (లంపీ స్కీన్ డిసీజ్) ని మహమ్మారిగా ప్ర‌క‌టించండి" అని రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివ‌ర‌కు రాష్ట్రంలో 22,000 కంటే ఎక్కువ ప‌శువులు.. అధికంగా ఆవులు ఈ చర్మ వ్యాధి కారణంగా మ‌ర‌ణించాయి.

దాదాపు ఏడుకు పైగా రాష్ట్రాలలో వ్యాపించిన ఈ ఆవుల చర్మ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. “సుమారు ఏడు నుండి ఎనిమిది రాష్ట్రాలు లంపి వ్యాధితో ప్రభావితమయ్యాయి. వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలని మేము భార‌త ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆవులు ఈ వ్యాధికి గురయ్యే విధానం బాధాకరమైనది..  ఊహించలేనిది” అని అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆవు ప్రభావితమైతే వాటికి టీకాలు వేయలేము.  సోక‌క‌ముందే  టీకాలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప‌శువుల‌కు సోకుతున్న ఈ లంపీ స్కీన్ డిసీజ్ కు మన దేశంలో వ్యాక్సిన్ లేదా మందులు లేవు. ఇప్పుడు ప్రయోగాలు ప్రారంభమయ్యాయని, త్వరలో వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

“పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటే, కోవిడ్ లాగా, అది మన పశువులపై ప్రభావం చూపుతుంది. ఇది మహమ్మారిగా ప్రకటించబడితే, రాష్ట్రానికి విపత్తు నిధుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిని ఎదుర్కొవ‌డానికి సమర్థవంతమైన పని చేయవచ్చు. ఈ వ్యాధి ప్రమాదకరమైనది.. వేగంగా వ్యాప్తి చెందుతోంది.  గుజరాత్‌లో కూడా పరిస్థితి దారుణంగా మారుతోంది” అని గెహ్లాట్ అన్నారు. రాజస్థాన్‌లో 22,000 కంటే ఎక్కువ జంతువులు, ప్రధానంగా ఆవులు ఈ అంటువ్యాధి కారణంగా చనిపోయాయి. ఈ చ‌ర్మ‌వ్యాధి రాష్ట్రంలోని మొత్తం 29 జిల్లాల‌కు వ్యాపించింది. జోధ్‌పూర్, బార్మర్, జైసల్మేర్, జలోర్, పాలి, సిరోహి, బికనేర్, చురు, గంగానగర్, హనుమాన్‌ఘర్, అజ్మీర్, నాగౌర్, భిల్వారా, టోంక్, జైపూర్, సికర్, జుంజును, అల్వార్, దౌసా, చిత్తోర్‌గఢ్, భరత్‌పూర్, ధోల్‌పూర్, కరౌలి, బన్స్వారా, ప్రతాప్‌గఢ్, దుంగార్‌పూర్, ఉదయపూర్‌లో ఈ లంపీ స్కీన్ డిసీజ్ కేసులు నమోదయ్యాయి.

గంగానగర్‌లో గరిష్టంగా 3,672  ప‌శువుల మరణాలు నమోదయ్యాయి. జోధ్‌పూర్ (2,426), హనుమాన్‌ఘర్ (2,167), నాగౌర్ (2,099), బార్మర్ (1,973), జలోర్ (1,765) మరియు బికనీర్ (1,704) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 5,12,140 ప‌శువుల‌కు ఈ వ్యాధి సోక‌గా, 4,61,643 పైగా ప‌శువుల‌కు చికిత్స‌ను అందించారు.  ఇదిలావుండగా, ఆయుర్వేదం, పశుసంవర్ధక శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో లంపి వ్యాధి నివారణలో సమర్థవంతమైన ఆయుర్వేద మందుల గురించి ముఖ్య కార్యదర్శి ఉషా శర్మ చర్చించారు. సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాల వినియోగానికి సంబంధించి అవసరమైన సర్క్యులర్లు, మార్గదర్శకాలను జారీ చేయాలని ఆమె ఆయుర్వేద శాఖ అధికారులను ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం