
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ మృతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం వుందన్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. ఆయన మరణం ప్రజాస్వామ్యానికి పెద్ద ఎదురు దెబ్బ అని అభివర్ణించిన స్పీకర్.. దీనిపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని కోరారు.
కాగా, డిసెంబర్ 15న జరిగిన కర్ణాటక విధాన పరిషత్ సమావేశాల్లో రసాభాస జరిగింది. ఛైర్మన్ కే చంద్రప్రతాప్ శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలకు దిగారు.
అంతటితో ఆగకుండా ఛైర్మన్ స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు సభాపతి సీటు నుంచి లాక్కెళ్లారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
ఈ క్రమంలో మంగళవారం రైల్వే ట్రాక్ పక్కన ధర్మెగౌడ శవమై కనిపించారు. ఆయన రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మరణంపై రాజకీయ పక్షాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
అటు ధర్మేగౌడ మరణం ఒక రాజకీయ కుట్ర అని, వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేసి, దర్యాప్తు చేపట్టాలని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల విధాన పరిషత్‌లో జరిగిన ఘటనలు ధర్మెగౌడను కలవరపరిచాయని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా కుట్ర చేసి, ధర్మెగౌడను హత్య చేశారని ఆయన ఆరోపించారు.
గౌడను ఛైర్మన్ సీటు నుంచి కిందికి లాక్కెళ్లి, అవమానించారని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేసింది తప్పో, ఒప్పో మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని కాంగ్రెస్ సభ్యులకు చురకలంటించారు.