లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడగింపు: ఉత్తర్వులు జారీ

By telugu team  |  First Published May 1, 2020, 6:35 PM IST

దేశంలో మరో రెండు వారాలు లాక్ డౌన్ ను పొడగిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగించింది. నిజానికి ఈ నెల 3వ తేదీన లాక్ డౌన్ ముగియాల్సి ఉండింది.


న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడగించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3వ తేదీ వరకు కేంద్రం రెండో విడత లాక్ డౌన్ విధించింది. 3వ తేదీ తర్వాత కేంద్రం లాక్ డౌన్ ను సడలించవచ్చునని భావించారు. అయితే, మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లకు కొన్ని సడలింపు ఇస్తూ లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. రెడ్ జోన్లలో కంటైన్మెంట్ నిబంధనలు కొనసాగుతాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగించింది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కట్టడి కాని పక్షంలో లాక్ డౌన్ ను పొడగించాలని కేంద్రం నిర్ణయించినట్లు భావించవచ్చు.. 

Latest Videos

విమాన, రైలు, మెట్రో ప్రయాణాలపై, రోడ్డు మార్గంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది. విద్యాసంస్థలు, హాస్పిటాలిటీ సర్వీసులపై, సామూహిక కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది. సినిమా హాల్స్, మాల్స్, జిమ్స్, క్రీడా సముదాయాలు మూసే ఉంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విమానాలు, రైళ్ల ద్వారా, రోడ్డు మార్గాల్లో ప్రయాణించడానికి అనుమతిస్తారు.

వలస కార్మికులకు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులకు ఊరట కలిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి వారికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారిని తరలించడానికి రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తోంది.

click me!