ఖరీదైన మద్యం లోడ్ తో వెళుతున్న వాహనం రోడ్డుప్రమాదానికి గురయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన మనుషులు మానవత్వాన్ని మరిచారని రుజువుచేసింది.
Uttar Pradesh : ఈ కలికాలంలో మానవత్వమే కరువైపోతోంది. నేను... నా కుటుంబం... ఆ తర్వాతే ఇంకెవరైనా, ఇంకేదైనా అనే మనస్తత్వమే అందరిదీ. చివరకు కళ్లముందే సాటి మనిషి ప్రాణాలు పోతున్నా సరే నాకెందుకులే అనుకునేవారు ఎక్కువైపోయారు. ఇలాంటి మనుషుల్లో మానవత్వం ఏ స్థాయిలో అడుగంటిందో తెలియజేసే ఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... యూపి లోని బిజ్నోర్ జిల్లాలో మద్యం లోడ్ తో వెళుతున్న ఓ డిసిఎం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. హైవేపై వేగంగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు... అలాగే డిసిఎంలోని ఖరీదైన విదేశీ మద్యం బాటిల్స్ చెల్లాచెదురుగా పడిపోయింది. అయితే ఒళ్లంతా రక్తంతో నిస్సహాయ స్థితిలో పడివున్న డ్రైవర్ ను కాపాడేందుకు ఎవరూ ముందుకురాలేదు కానీ రోడ్డుపై పడిన మందు బాటిల్స్ ను అందినకాడికి తీసుకెళ్లారు. ఇలా సాటి మనిషి ప్రాణాల కంటే మద్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేవరకు డ్రైవర్ అలాగే గాయాలతో పడివున్నాడు. అతడిని పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే రోడ్డుపై పడిన ఖరీదైన మందు బాటిల్స్ ను అటుగా వెళుతున్న వాహనదారులు, స్థానికులు అందినకాడికి తీసుకెళ్లారు. డిసిఎంలో మద్యం లోడ్ వుండటంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే డ్రైవర్ గాయాలతో పడివుండటం చూసి, ఆర్తనాదాలు విని కూడా కసాయి మనుషులు చలించలేదు. అతడి పక్కనుండే వెళుతూ మందు బాటిల్స్ ఎత్తుకెళ్ళారు. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమానవీయంగా ప్రవర్తించిన స్థానికులపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరికొందరేమో సరదా కామెంట్స్ చేస్తున్నారు.
కరువైన మానవత్వం.. గాయపడిన డ్రైవర్‌ను వదిలేసి మందు సీసాలు ఎత్తుకెళ్లిన జనం
ఉత్తర ప్రదేశ్ - బిజ్నోర్ జిల్లాలో నజిబాబాద్ హైవేపై మద్యాన్ని తీసుకెళ్తున్న డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌కు సహాయం చేయకుండా అక్కడి జనం మందు సీసాలు… pic.twitter.com/omNBpP9ESZ