ఎల్‌జీ నా హెడ్ మాస్టర్ కాదు.. నన్ను ప్రజలు సీఎంగా ఎన్నుకున్నారు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

By Sumanth KanukulaFirst Published Jan 17, 2023, 5:29 PM IST
Highlights

ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని.. రేపు కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి రావచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో కేజ్రీవాల్ సర్కార్ అధికార పోరు నేపథ్యంలో కేజ్రీవాల్‌ మంగళవారం ఈ కామెంట్స్ చేశారు. 

ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని.. రేపు కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి రావచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో కేజ్రీవాల్ సర్కార్ అధికార పోరు నేపథ్యంలో కేజ్రీవాల్‌ మంగళవారం ఈ కామెంట్స్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘సమయం చాలా శక్తివంతమైనది. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఎప్పటికీ అధికారంలో ఉంటామని ఎవరైనా అనుకుంటే అది జరిగే పని కాదు. ఈరోజు మనం ఢిల్లీలో అధికారంలో ఉన్నాం.. కేంద్రంలో వారే (బీజేపీ) అధికారంలో ఉన్నారు. రేపు కేంద్రంలో మనం అధికారంలో ఉండొచ్చు’’ అని అన్నారు. 

లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫ్యూడల్ మనస్తత్వం బాధపడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం విమర్శించారు. ఆయనకు నగరంలో పేద పిల్లలు బాగా చదువుకోవడం ఇష్టం లేదని ఆరోపించారు. ‘‘ఎల్‌జీ నా ఫైళ్లను పరిశీలిస్తున్నంతగా.. నా ఉపాధ్యాయులు కూడా నా హోంవర్క్‌ను తనిఖీ చేయలేదు. ఎల్‌జీ నా ప్రధానోపాధ్యాయుడు కాదు.. ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు’’ అని కేజ్రీవాల్ అన్నారు. 

‘‘తన వల్లనే ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకుందని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలనూ కాషాయ పార్టీ గెలుచుకుంటుందని ఎల్‌జీ నాతో ఒక సమావేశంలో చెప్పారు’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘ఎల్‌జీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు.. మన తలపై కూర్చున్నారు. మన పిల్లలను ఎక్కడ చదివించాలో ఆయన నిర్ణయిస్తారా? ఇలాంటి భూస్వామ్య మనస్తత్వం ఉన్న వారి వల్ల మన దేశం వెనుకబడి ఉంది’’ అని విమర్శించారు. 

ఎల్‌జీకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని కేజ్రీవాల్ అన్నారు. విదేశాల్లో చదివిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లల జాబితాను కూడా చూపించిన కేజ్రీవాల్.. ప్రతి ఒక్కరూ అత్యుత్తమ విద్యను పొందాలని సూచించారు.

click me!