
ఇది నిజంగా వన్యప్రాణి ప్రేమికులు విషాద వార్త అనే చెప్పాలి. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) పెంచ్ టైగర్ రిజర్వ్‌లో (pench tiger reserve) ప్రసిద్దిచెందిన T15 పులి మరణించింది. కాలర్‌వాలి (Collarwali), మాతరం (Mataram) అని కూడా పిలువబడే ఈ పులి వృద్ధాప్యం కారణంగా శనివారం మృతిచెందింది. అయితే ఈ పులి గురించి ఎందుకు ఇంత చెప్పుకోవాల్సి వస్తుందంటే.. దానికున్న ప్రత్యేకత అలాంటింది. ఈ పులి దాదాపు 16 ఏళ్లకు పైగా జీవించింది. తన జీవిత కాలంలో 29 పిల్లలకు జన్మనిచ్చింది. T15 అని నామాకరణం చేయబడిని ఈ పులి.. T7కి 2005లో జన్మించింది. ఇది తొలిసారిగా 2008 మే 25న మొదటి ప్రసవంలో మూడు పులి పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అవి మూడు కూడా మరణించాయి. ఆ తర్వాత ఆ పులి మొత్తం 29 పిల్లలకు జన్మనిచ్చింది. చివరిసారిగా ఆ పులి 2019లో పులి పిల్లలకు జన్మనిచ్చింది.
అడవిలో ఆడపులులు 17 ఏళ్లు జీవించడమనేది చాలా ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం మధ్యప్రదేశ్ పీసీసీఎఫ్ (వన్యప్రాణులు) అలోక్ కుమార్ T15 మరణించిన విషయాన్ని ధ్రువీకరించారు. శనివారం సాయంత్రం 6.15 గంటలకు తుదిశ్వాస విడిచిందని చెప్పారు.
కాలర్‌వాలి (T15) శుక్రవారం సీతాఘాట్ ప్రాంతంలో నేలపై పడుకుని కనిపించింది. దీంతో దానిని వెటర్నిటీ వైద్యుల పరిశీలనలో ఉంచినట్టుగా అధికారులు తెలిపారు. ఇక, ఈ పులిని.. 'మదర్ ఆఫ్ పెంచ్'గా పిలుస్తారని చెప్పారు. కాలర్‌వాలి అత్యధికంగా ఫోటో తీయబడిన పులి.. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
ఇదే విషయాన్ని ఐఎఫ్‌ఎస్ అధికారి Parveen Kaswan ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 29 పిల్లలకు జన్మనిచ్చిన ప్రసిద్ధ పులి కాలర్‌వాలి.. ఇప్పుడు మనతో లేదు అని పేర్కొన్నారు. అంతేకాకుండా కాలర్‌వాలి తన పిల్లలతో నీటిని తాగతున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోను తనకు ఓ ఫ్రెండ్ పంపినట్టుగా చెప్పారు.