నిందితుల తరఫున వాదించబోం.. మోర్బీ ఘటనపై బార్ అసోషియేషన్ కీలక నిర్ణయం  

By Rajesh KarampooriFirst Published Nov 2, 2022, 2:03 PM IST
Highlights

వంతెన ప్రమాదంలో నిందితులకు న్యాయ సహాయాన్ని అందించకూడదని మోర్బీ బార్ అసోసియేషన్, రాజ్ కోఠ్ బార్ అసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒరేవా సంస్థ చెందిన తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

గుజరాత్ లోని మోర్బీ వంతెన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ వంతెన ప్రమాదంలో 135 మంది చనిపోయారు. నదిలో మృతదేహాన్ని వెలికితీసే పని ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత నిర్వహకుల నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నలుగురు పోలీసు రిమాండ్‌లో ఉండగా, ఐదుగురు జైలుకు పంపబడ్డారు. వీరంతా ఒరేవాకంపెనీకి చెందినవారు.  
 
ఈ క్రమంలో మోర్బీ బార్ అసోసియేషన్, రాజ్‌కోట్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రమాదంలో నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాదులు నిరాకరించారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది నిందితుల తరఫున వాదించబోరని మోర్బీ బార్ అసోసియేషన్, రాజ్ కోట్ బార్ అసోసియేషన్ తీర్మానాలను ఆమోదించినట్టు మోర్బీ న్యాయవాదుల సంఘం సీనియర్ అడ్వొకేట్ ఏ.సి. ప్రజాపతి తెలిపారు. వంతెన ప్రమాదంలో నిందితులకు న్యాయ సహాయాన్ని అందించకూడదనీ, ఈ రెండు న్యాయవాదుల సంస్థలు తీర్మానం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి.

మోర్బీ బ్రిడ్జి ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులర్పించేందుకు గుజరాత్‌లో నేడు( నవంబర్2)
రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలు పాటించారు. ప్రభుత్వ భవనాల్లో జాతీయ జెండాను సగానికి నిలిపారు. ఈరోజు ఎలాంటి వినోదం లేదా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఉండవు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సంతాప దినాలు పాటించాలని నిర్ణయించారు.

ప్రధాని మోదీ సమీక్ష.. పరమర్శ.. 

మోర్బీలో దెబ్బతిన్న వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పరిశీలించారు. సివిల్‌ ఆస్పత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన వారితో మాట్లాడారు. మోర్బీ ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాలను తెలుసుకోవడానికి ఆయన వివరణాత్మక,సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరమర్శించారు. 

నవంబర్ 14న సుప్రీంకోర్టులో విచారణ

మోర్బీ వంతెన ప్రమాదం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. విచారణకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వీటిని నవంబర్ 14న విచారించనున్నారు.

అంతా దైవ నిర్ణయం 

ప్రమాదం జరిగిన తర్వాత పలువురు అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెలువెత్తున్నాయి. అయితే బ్రిడ్జి మరమ్మతులు, నిర్వహణ చేస్తున్న ఒరేవా సంస్థ మాత్రం ప్రమాదాన్ని పూర్తిగా దేవుడిపైనే వేసింది.ఈ బాధాకరమైన ప్రమాదం నుంచి కంపెనీ మీడియా మేనేజర్ దీపక్ పరేఖ్ పూర్తిగా తప్పించుకున్నారు. ఇది భగవంతుడి నిర్ణయం అని తెలిపారు. అందువల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరించారు.

click me!