
Uttarakhand Assembly Election 2022: దేశంలో వచ్చే నెలలో జరిగి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రచారం వేగం పెంచాయి రాజకీయ పార్టీలు. దీంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోనూ అధికార పీఠం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు.. ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. రాజకీయ పార్టీల్లో వ్యుహ, ప్రతివ్యుహాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీల్లో చేరికలు, పార్టీలను విడిచిపెట్టడాలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే దివంగత, భారత దేశ మొట్టమొదటి త్రివిధ దళాదిపతి CDS (Chief of Defence Staff of the Indian Armed Forces) జనరల్ బిపిన్ రావత్ సోదరుడు.. మాజీ కల్నల్ విజయ్ రావత్ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. అంతకు ముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఢిల్లీలో కల్నల్ విజయ్ రావత్‌ను కలిశారు. అనంతరం బుధవారం సాయంత్రం ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రావత్ పోటీ చేయవచ్చని ఉత్తరాఖండ్ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన అనంతరం కల్నల్ విజయ్ రావత్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీపై ప్రశంసలు కురిపించారు. అలాగే, తన తండ్రి ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత "బిజెపిలో" ఉన్నారని, ఇప్పుడు పదవీ విరమణ తర్వాత తనకు అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరాలన్న తన నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ “విశిష్ట” దార్శనికత, “అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్” కారణమని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కష్టపడి పనిచేసే పార్టీ అని, నిజంగా దేశ మేలు కోరుకునే పార్టీ అని కొనియాడారు. తన కుటుంబం, బీజేపీ సిద్ధాంతాలు చాలా పోలి ఉంటాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో చేరి ప్రజాసేవ చేయాలనుకుంటున్నామన్నారు. పార్టీ ఆమోదం లభిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Uttarakhand Assembly Election 2022) పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఇదిలావుండగా, ఉత్తరాఖండ్ (Uttarakhand) లో మాజీ సైనికులతో పాటు ప్రస్తుతం కానసాగుతున్న జనాభా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలోని మాజీ సైనికులను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించాయి. ఈ విషయంలో బీజేపీ కాస్త ముందున్నదనే చెప్పాలి. ఇతర పార్టీలు సైతం బీజేపీని ఇరుకున పెట్టే విధంగా అక్కడి మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతున్నాయి. ఉత్తరాఖండ్ ఆప్ సైతం ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కల్నల్ (రిటైర్డ్) అజయ్ కొథియాల్‌ను పోటీలో నిలిపింది. అలాగే, ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సైనికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇదిలావుండగా, ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ఫిబ్రవరి 14న 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.