
బెంగళూరులో సీఐడీ మహిళా డీఎస్పీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. .కోలార్ జిల్లా మలూరు తాలుకా మాస్తి గ్రామానికి చెందిన లక్ష్మీ (33).. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2014లో నిర్వహించిన సీఐడీ పరీక్షలో లక్ష్మీ ఉత్తీర్ణత సాధించారు.
శిక్షణ అనంతరం 2017లో బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్నేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె డీఎస్పీగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి తన స్నేహితురాలి ఇంట్లో పార్టీ ఉండటంతో అక్కడికి వెళ్లారు లక్ష్మీ.
ఈ సందర్భంగా గది నుంచి ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానమొచ్చిన స్నేహితులు తలుపులు బద్ధలుకొట్టి చూడగా లక్ష్మీ ఉరికి వేలాడుతూ కనిపించారు. ఆమెను వెంటనే కిందికి దించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతురాలికి ఎనిమిదేళ్ల కిందట వివాహమైందని, అప్పటి నుంచి సంతానం కలుగలేదన్న నిరాశతో లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిగిలిన కోణాల్లో ఆరా తీస్తున్నారు.