కుమార స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు: మండిపడుతున్న బీజేపీ

By Nagaraju TFirst Published Dec 25, 2018, 5:50 PM IST
Highlights

కర్ణాటక సీఎం కుమార స్వామి వివాదంలో ఇరుకున్నారు. మాండ్య జిల్లాలో జేడీఎస్ నేత ప్రకాష్‌ను హత్య చేసిన హంతకులను కాల్చి పారేయండంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాల్చి పారేయండంటూ కుమార స్వామి చేసిన వ్యాఖ్యలు కెమెరాకు చిక్కడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


బెంగళూరు: కర్ణాటక సీఎం కుమార స్వామి వివాదంలో ఇరుకున్నారు. మాండ్య జిల్లాలో జేడీఎస్ నేత ప్రకాష్‌ను హత్య చేసిన హంతకులను కాల్చి పారేయండంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాల్చి పారేయండంటూ కుమార స్వామి చేసిన వ్యాఖ్యలు కెమెరాకు చిక్కడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

సీఎం వ్యాఖ్యలు ప్రస్తుతం కన్నడ నాట సంచలనంగా మారాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిన సీఎం తక్షణం క్షమాపణలు చెప్పాలని డీమాండ్ చేసింది. 

రాష్ట్రంలో రైతులు చనిపోయినప్పుడు, ప్రభుత్వ అధికారులు హతమైనప్పడు ఇలా ఎప్పుడైనా స్పందించారా అని బీజేపీ రాష్ట్ర యూనిట్ ఓ ట్వీట్‌లో సీఎంపై మండిపడింది.
మరోవైపు కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
ముఖ్యమంత్రి నోటి నుంచి ఇలాంటి మాటలొస్తాయని తాను ఏనాడూ అనుకోలేదన్నారు. సీఎం ఇలా మాట్లాడితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మాటేమిటి అని నిలదీశారు.   కుమారస్వామి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమంటూ మండిపడ్డారు.  
 
ఇకపోతే జేడీఎస్ నేత ప్రకాష్‌ హత్యపై కుమారస్వామి ఫోనులో మాట్లాడుతూ ప్రకాష్ చాలా మంచి వ్యక్తి. అతన్ని వాళ్లెందుకు హత్య చేశారో నాకు తెలియదు. అలాంటి వాళ్లని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయండి. ఎలాంటి సమస్యా లేదు అని ఆదేశాలిచ్చారు. 

ఇదంతా కెమెరాకు చిక్కడంతో సీఎం ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా తాను ఆదేశాలివ్వలేదని, ఆ నిమిషంలో భావోద్వేగంతో అన్న మాటలేనని చెప్పుకొచ్చారు. ప్రకాష్ హంతకులు అంతకుముందు రెండు హత్యలు చేసి జైలులో ఉన్నారని, రెండ్రోజుల క్రితమే వాళ్లు బెయిలుపై బయటకు వచ్చారని చెప్పారు. బెయిల్‌పై వచ్చి మరో హత్య చేయడమంటే ఇది బెయిల్‌ దుర్వినియోగానికి పాల్పడటమేనని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

ఈ వార్తలు కూడా చదవండి

చంపేయ్: కుమారస్వామి ఆదేశాలు, వీడియో కలకలం

click me!