మాయదారి మహమ్మారి: ఉద్యోగాల్లేవు మరి... అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన మహిళ

By Siva KodatiFirst Published Aug 6, 2020, 2:59 PM IST
Highlights

కరోనా వైరస్ ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థలను తలక్రిందులు చేసింది. ప్రజల జీవితాలు కోవిడ్‌కు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయింది. దీని ధాటికి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రోడ్డున పడ్డారు

కరోనా వైరస్ ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థలను తలక్రిందులు చేసింది. ప్రజల జీవితాలు కోవిడ్‌కు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయింది. దీని ధాటికి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రోడ్డున పడ్డారు.

వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్ విధించడంతో ఎందరో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. బతుకుతెరువు కోసం నగరాలకు వచ్చిన వారు తిరిగి గ్రామాల బాట పట్టారు. ఈ  క్రమంలో ఓ మహిళ అంబులెన్స్ డ్రైవర్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన దీపా జోసెఫ్ కరోనాకు ముందు ఓ కాలేజ్ బస్సులో డ్రైవర్‌‌గా పనిచేసేది. అయితే వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి.

దీంతో దీప ఉద్యోగం పోయింది. తప్పనిసరి పరిస్ధితుల్లో కుటుంబం కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా మారింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాలేజీ మూతపడటంతో చేస్తున్న ఉద్యోగం ఊడింది.

ఆర్ధిక ఇబ్బందులు సైతం ఎదురయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, మా ఇంట్లో నేను, నా భర్త, ఇద్దరు పిల్లలు , అమ్మ ఉంటున్నామని దీప చెప్పారు.

కుటుంబాన్ని పోషించాలంటే ఏదో ఒక పని చేయాలి... దీంతో తప్పని పరిస్థితుల్లో అంబులెన్స్ డ్రైవర్‌గా మారానని ఆమె అన్నారు. ప్రస్తుతం తన కుమారుడు పదో తరగతి, కుమార్తె 8వ తరగతి చదువుతోందని.. అంబులెన్స్ డ్రైవర్‌గా చేరినందుకు వారి నుంచి మద్ధతు లభించిందని దీప తెలిపారు.

click me!