ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి రంగం సిద్దం.. మరో రెండు రాష్ట్రాల్లో కూడా.. కేసీఆర్ ప్లాన్ ఇదే..!

By Sumanth KanukulaFirst Published Dec 13, 2022, 9:43 AM IST
Highlights

భారత రాష్ట్ర సమితి‌(బీఆర్ఎస్)‌తో జాతీయ రాకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేశారు. 

భారత రాష్ట్ర సమితి‌(బీఆర్ఎస్)‌తో జాతీయ రాకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేశారు. టీఆర్ఎస్ పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం లభించడంతో.. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 14వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ తాత్కాలిక కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం, భవిష్యత్ కార్యచరణపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. 

అదే సమయంలో 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్‌ విస్తరణ, పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో బీఆర్ఎస్ పార్టీ యూనిట్లను ప్రారంభించేందుకు కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో బీఆర్‌ఎస్ తాత్కాలిక కార్యాలయం ప్రారంబోత్సం కోసం సోమవారం ఢిల్లీ చేరుకున్న కేసీఆర్.. నేడు, రేపు రాజశ్యామల యాగం  నిర్వహించారు. రేపు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే డిసెంబరు 17 వరకు దేశ రాజధానిలోనే ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బీఆర్ఎస్ కోఆర్డినేటర్లను నియమిస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అధ్యక్ష, కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించే వీరు ఆయా రాష్ట్రాలకు వారు ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో పార్టీ కార్యవర్గ నియమాకాలకు కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఏపీలో పార్టీ కార్యాలయం కొన్ని స్థలాలను కేసీఆర్ పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు.. జక్కంపూడి సమీపంలో మూడు స్థలాలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. విజయవాడకు వెళ్లనున్నారు.  ఆ స్థలాలను పరిశీలించిన అనంతరం.. కేసీఆర్ సూచనతో ఏదో ఒకదానిని ఎంపిక చేయనున్నారని సమాచారం. 

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర.. మూడు రాష్ట్రాలు కూడా తెలంగాణ సరిహద్దును కలిగి ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలపై ఆయా రాష్ట్రాల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు.  

తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న మహారాష్ట్ర, కర్ణాటకలలోన పలు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలప ఆసక్తితో ఉన్నారని.. అందుకే అటువంటి పథకాలను అమలు చేయాలనే కోరికను వ్యక్తం చేస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్‌ఎస్ ఎన్నికైతే ఈ పథకాలను పొడిగిస్తామని హామీ ఇవ్వడం ద్వారా అక్కడి ప్రజలకు చేరువ కావాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

click me!