
హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే కార్యక్రమాలపై బీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది. ఇప్పటికే మహరాష్ట్రలోని నాందేడ్ లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది. గత నెల 5వ తేదీన నాందేడ్ లో బీఆర్ఎస్ సభ నిర్వహించింది. ఈ సభ విజయవంతం కావడంతో మహరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కో ఆర్డినేటర్లను బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోఆర్డినేటర్ల పేర్లను బుధవారం నాడు ప్రకటించారు.
మహరాష్ట్రలో బీఆర్ఎస్ ను విస్తరించేందుకు అవకాశాలున్నాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ దిశగా కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలనే మహరాష్ట్రలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించిన విషయం తెలిసిందే.
2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీలో చేరికలపై కేసీఆర్ కేంద్రీకరించారు. పలు పార్టీల్లో కీలకంగా పనిచేసిన నేతలతో కేసీఆర్ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సామాజిక, ఆర్ధిక , రాజకీయ పరిస్థితుల ఆధారంగా పార్టీ విస్తరణపై కేసీఆర్ టీమ్ వ్యూహ రచనకు దిగింది.
మహరాష్ట్రలో సభ విజయవంతం కావడంతో మిగిలిన రాష్ట్రాల్లో కూడా సభలు నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సభ నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. విశాఖపట్టణంలో ఈ సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ లో చేరికలు ముమ్మరమయ్యాయి. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. మరో వైపు యూపీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హిమాన్షు తివారీని నియమిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.
మహరాష్ట్ర బీఆర్ఎస్ రీజినల్ కోఆర్డినేటర్లు
నాసిక్: దశరథ్ సావంత్
పుణె : బాలసాహెబ్ జైరామ్ దేశ్ ముఖ్
అమరావతి:నిఖిల్ దేశ్ ముఖ్
ఔరంగబాద్: సోమ్ నాథ్
ముంబై:విజయ్ టాంజై మొహిత్
నాగ్‌పూర్:ద్యానేష్ వకుద్కర్