
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు లక్ష్యం చేసుకుని మరి చంపేస్తున్నారని, తమకు ప్రాణ భయం ఉన్నదని కశ్మీరీ పండిట్లు ఆందోళనలు చేస్తున్నారు. టార్గెటెడ్ కిల్లింగ్స్‌కు వ్యతిరేకంగా వారు నిరసనలు చేస్తున్నారు. కశ్మీరీ పండిట్లలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది కశ్మీర్ లోయను వదిలి బయటకు వెళ్లిపోయారు. మిగతా కశ్మీరీ పండిట్లు కశ్మీర్ లోయ వదిలి జమ్ము రీజియన్‌కు వలస వెళ్లిపోతామని బెదిరిస్తున్నారు. కశ్మీరీ పండిట్ల కోసం ప్రధాని మోడీ ఆఫర్ చేస్తున్న జాబ్ ప్యాకేజీనీ కూడా వారు పట్టించుకోవడం లేదు.
ఈ రోజు ఉదయం కుల్గాం జిల్లాలో బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌కు చెందిన విజయ్ కుమార్ అరే ఏరియాలో ఓ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో రెండో హత్య ఇది. కశ్మీరీ పండిట్ అయిన ఓ స్కూల్ టీచర్‌ను ఉగ్రవాదులు హతమార్చిన సంగతి తెలిసిందే. గత నెలలోనూ కశ్మీర్ పండిట్ అయిన రెవెన్యూ ఉద్యోగి రాహుల్ భట్‌నూ దారుణంగా కాల్పులు జరిపి చంపేశారు. ఈ నేపథ్యంలోనే వందలాది మంది కశ్మీరీ పండిట్లు లోయను వదిలి వెళ్లిపోతామని రోడ్డెక్కారు.
శ్రీనగర్‌లో మూడు వారాలుగా ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న అమిత్ కౌల్ తాజాగా శ్రీనగర్ జమ్ములో నిరసనలు చేపట్టినట్టు వివరించారు. వారు రామబాణ్ జిల్లాలోని రామ్సూను క్రాస్ చేశారని, జమ్ము రీజియన్‌కు చేరుకున్నారని తెలిపారు. వీరిని అడ్డుకోవడానికి యూటీ అడ్మినిస్ట్రేషన్ బారికేడ్లు పెడుతున్నది. గేట్లు లాక్ చేసి తాత్కాలిక శిబిరాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నది.
కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు. ఢిల్లీలో వీరు కలిసి కశ్మీర్‌లో పరిస్థితులను సమీక్షించారు.
కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీకి ఆహ్వానించారు. ఢిల్లీకి వచ్చి సమావేశం కావాలని కోరారు. జమ్ము కశ్మీర్‌లో శాంతి భద్రతల కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కశ్మీర్ లోయలో మైనార్టీల భద్రత కల్పించలేకపోవడానికి గల కారణాలు ఏమిటో అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.