అమ్మో కార్వార: ఆరుగురు సీఎంల పదవి ఊస్టింగ్.. అడుగు పెడితే అధికారం గల్లంతే

By narsimha lodeFirst Published Sep 2, 2019, 5:34 PM IST
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు సెంటిమెంట్లు, జ్యోతిష్యం, వాస్తు నమ్మకాలు ఎక్కువ. పదవి కలిసిరావడం లేదనే భయంతో ఈ మధ్యనే యడ్యూరప్పగా ఉన్న తన పేరును యడియూరప్పగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఓ సెంటిమెంట్ విషయంలో భయపడుతున్నారు. 

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు సెంటిమెంట్లు, జ్యోతిష్యం, వాస్తు నమ్మకాలు ఎక్కువ. పదవి కలిసిరావడం లేదనే భయంతో ఈ మధ్యనే యడ్యూరప్పగా ఉన్న తన పేరును యడియూరప్పగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఓ సెంటిమెంట్ విషయంలో భయపడుతున్నారు.

అసలు మ్యాటరేంటంటే.. చామరాజనగరకు వెళ్తే ఏ ముఖ్యమంత్రి అయినా ఆరు నెలల్లో పదవి కోల్పోతారన్న సెంటిమెంట్ కన్నడనాట బలంగా వుంది. అచ్చం ఇలాంటి ప్రచారమే అరేబియా తీరంలో ఉన్న కార్వార మీదా వుంది.

ఇందుకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరణగా చెబుతున్నారు రాజకీయ పండితులు. ఈ భయంతోనే యడియూరప్ప కార్వార పర్యటనను ఉన్నట్టుండి రద్దు చేసుకున్నారు.

గత శనివారం సీఎం కార్వారలో పర్యటించాల్సి వుంది. అయితే వాతావరణం అనుకూలంగా లేదనే సాకుతో పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం వస్తారని జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు.

కార్వారతో పాటు శిరసి, సిద్ధాపుర, కుమటె, అంకోలా, భత్కళ ప్రాంతాల్లో యడియూరప్ప పర్యటించాల్సి వుంది. సెంటిమెంట్ విషయం తెలుసుకున్న సీఎం.. వాతావరణం సాకుతో అదే హెలికాఫ్టర్‌లో శివమొగ్గకు తరలివెళ్లారు. .

కార్వారలో సెంటిమెంట్‌కు బలైన ముఖ్యమంత్రులు

* 2005 నవంబర్‌లో అప్పటి సీఎం ధరంసింగ్ కార్వారలో పర్యటించారు. ఆ తర్వాత రెండు నెలలకే జేడీఎస్ మద్ధతు ఉపసంహరించడంతో ధరంసింగ్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.

* 2010 నవంబర్‌ 19న ఇదే యడియూరప్ప సీఎం హోదాలో కార్వారలో అడుగుపెట్టారు. ఆ తర్వాతి ఏడాదే యడ్డీ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడంతో సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

* 2012 ఫిబ్రవరిలో సదానందగౌడ కార్వార పర్యటన అనంతరం అదే ఏడాది జూలైలో.. పార్టీలో గ్రూపు తగాదాల కారణంగా సీఎం పదవిని కోల్పోయారు.

* 2013 ఫిబ్రవరిలో జగదీశ్ షెట్టర్ కార్వార్‌లో పర్యటించిన తర్వాత.. మే నెలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో మాజీ ముఖ్యమంత్రిగా మిగిలారు. 

* 2018 ఫిబ్రవరిలో కార్వార వెళ్లిన సిద్ధరామయ్య.. మే నెలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో మాజీ అయ్యారు. 

* తాజాగా 2019 ఏప్రిల్ 4న కుమారస్వామి కార్వారను సందర్శించారు. ఆ తర్వాత కొద్దినెలలకే అసంతృప్తి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో బలపరీక్షలో ఓడిపోయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 

click me!