వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి, అప్పుడే పుట్టిన కవలలు మృతి

By Mahesh RajamoniFirst Published Nov 4, 2022, 3:08 PM IST
Highlights

Karnataka: కర్నాటకలోని తుమకూరులో ప్రసవానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిరాకరించడం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి, ఆమెకు అప్పుడే పుట్టిన కవల పిల్లలు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు ఆస్పత్రి సిబ్బందిని ఉన్న‌తాధికారులు సస్పెండ్ చేశారు.
 

Doctors negligence in Tumkur: ప్రాణాలు ర‌క్షించే, క‌నిపించే దేవుళ్లుగా వైద్యుల‌ను చూస్తారు. అయితే, ఒక డాక్టర్ వైద్యం అందించడానికి నిరాకరించి.. నిర్ల‌క్ష్య వ్యవహారం కార‌ణంగా గర్భిణి, ఆమెకు అప్పుడే పుట్టిన కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యం తెలిసిన ఉన్న‌తాధికారులు న‌లుగురు వైద్య సిబ్బందిని స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటుచేసుకుంది. 

ఇండియాటూడే క‌థ‌నం ప్ర‌కారం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కర్నాటకలోని తుమకూరులో ప్రసవానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిరాకరించడం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి, ఆమెకు అప్పుడే పుట్టిన కవల పిల్లలు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు ఆస్పత్రి సిబ్బందిని ఉన్న‌తాధికారులు సస్పెండ్ చేశారు. మృతురాలు కస్తూరి (30) ఒంటరి తల్లి, ఒక‌ కుమార్తె ఉంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా భారతి నగర్‌లో ఆమె అద్దె ఇంట్లో నివాస‌ముంటున్నారు. ఆమె తొమ్మిది నెలల గర్భవతి.. క‌డుపులో కవల పిల్లలు ఉన్నార‌ని ఇదివ‌ర‌కు వైద్య ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డైంది. బుధవారం సాయంత్రం ఆమెకు ప్రసవ నొప్పులు మొద‌ల‌య్యాయి. 

ఆమె ఇంట్లో గృహ సహాయకులు ఎవరూ లేరు. చుట్టుపక్కల వారు డబ్బు వసూలు చేసి, సీనియర్ సిటిజన్ సహాయంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు తల్లి కార్డు (హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కార్డ్) లేదా ఆధార్ కార్డు లేకపోవడంతో వైద్య సిబ్బంది, డ్యూటీ డాక్టర్ ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోలేదు. ఆమెను 80 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. వైద్యం అందించకుండా గర్భిణిని వెనక్కి పంపించారు. ఇంటికి వచ్చిన కస్తూరి ఇంట్లో ఎవరూ లేకుండానే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండవ బిడ్డను ప్రసవిస్తున్నప్పుడు, ఆమె చాలా రక్తం కోల్పోయింది. ఈ క్ర‌మంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పుడే పుట్టిన కవల పిల్లలు ఇంట్లోనే మృతి చెందారు.

గర్భిణి, ఆమె ఇద్దరు పిల్లల మృతికి తుమకూరు జిల్లా ఆసుపత్రి వైద్యుడే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీహెచ్‌వో) మంజునాథ్‌ సందర్శించారు. ఈ విషయాన్ని స్థానికులు డీహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆస్పత్రిలో సంబంధిత వైద్యులు, సిబ్బందిని సస్పెండ్‌ చేశామని మంజునాథ్‌ తెలిపారు. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ కూడా గురువారం జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు వైద్య సిబ్బందిని, డ్యూటీ డాక్టర్‌ను సస్పెండ్‌ చేశారు.

మంత్రి రాజీనామా చేయాలి.. 

మహిళ, ఇద్దరు నవజాత శిశువుల మృతికి మంత్రి సుధాకర్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయ‌కులు సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు. తుమకూరు జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు నవజాత శిశువుల మరణానికి కారణమైన ఆరోగ్య శాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలనీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను సర్వీసు నుంచి తొలగించాలనీ, మొత్తం ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. క‌రోనా మహమ్మారి నుండి ఆరోగ్య శాఖ బాధ్యతారహిత ప్రవర్తన కారణంగా వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయ‌న ఆరోపించారు. సుధాకర్ ఆరోగ్య మంత్రిగా కొనసాగితే, వరుస వైద్య హత్యలు కొనసాగే అవకాశముంద‌ని అన్నారు. అపాయింట్‌మెంట్ నుంచి బదిలీ వరకు అన్నీ డబ్బుతోనే జరుగుతాయి కాబట్టి, ఏ ఒక్క అధికారి కూడా ఏ మంత్రిని బాధ్యులను చేయలేదంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

click me!