
ఉర్దూలో మాట్లానందుకు ఒక దళిత యువకుడిని హతమార్చారంటూ కర్ణాటక హోంమంత్రి జ్ఞానేంద్ర (karnataka home minister) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది గంటలకే ఆయన యూటర్న్ తీసుకున్నారు. వాస్తవానికి అది ఉర్దూ మాట్లాడకపోవడం వల్ల కాదు, రోడ్ యాక్సిడెంట్ (accident) అనంతరం జరిగిన పరిణామాల వల్ల జరిగిన సంఘటన అని హోంమంత్రి వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ (bangalore police commissioner) ట్విట్టర్ ద్వారా తెలిపిన తర్వాత మంత్రి ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. చంద్రు అనే వ్యక్తి తన స్నేహితుడు సైమన్ రాజ్‌తో కలిసి బుధవారం అర్థరాత్రి మైసూర్ రోడ్డులో భోజనం చేయడానికి వెళ్లాడు. అనంతరం పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా చందు బైక్ మరొక బైక్ పరస్పరం ఢీకొట్టుకున్నాయి. దీనిపై ఇరు వైపుల మధ్య మాట మాటా పెరిగి, ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతలో షహీద్ అనే వ్యక్తి చందు కుడి తొడపై పొడిచాడు. ఆపై వారంతా అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయంతో బాధపడుతున్న చందును ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని కమీషనర్ తెలిపారు.
అయితే ఉర్దూ మాట్లాడకపోవడం వల్లే యువకుడిని హత్య చేశారని, పలుమార్లు పొడిచి చంపారని హోంమంత్రి జ్ఞానేంద్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయమై ఆయనను మీడియా ప్రశ్నించగా.. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక హోంమంత్రి వ్యాఖ్యలపై విపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. సీఎల్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ హోంమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. ఆయన ఆ పదవికి ఎంత మాత్రం అర్హుడు కాదంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో మతసామర్యాన్ని దెబ్బతీసి అల్లర్లు సృష్టించేందుకు ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మరో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది.