మీరు సక్రమంగా పని చేయడానికి పీఎం, ప్రెసిడెంట్లు తరుచూ పర్యటించాలా?: అధికారులపై హైకోర్టు సీరియస్

By Mahesh KFirst Published Jun 25, 2022, 5:53 PM IST
Highlights

బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ), బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్‌బీ) అధికారులపై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది. ఎన్ని సార్లు ఆదేశించినా విధులు సక్రమంగా నిర్వర్తించరా? అంటూ మండిపడింది. ప్రధాని, ప్రెసిడెంట్ నగరంలో తరుచూ పర్యటిస్తేనే.. మీరు మీ పనులు సక్రమంగా చేస్తారేమో అని ఫైర్ అయింది.

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు బెంగళూరు అధికారులపై సీరియస్ అయింది. బెంగళూరు నగరంలో రోడ్లు, పౌర మౌలిక సదుపాయాల దుస్థితి గురించి ప్రస్తావిస్తూ బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ), బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్‌బీ)ల తీరుపై మండిపడింది. మీరు సక్రమంగా పని చేయాలంటే.. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్‌లు తరుచూ పర్యటించాలా? అని అడిగింది. పీఎం, అధ్యక్షులు తరుచూ పర్యటిస్తేనే ఈ అధికారులు సక్రమంగా పని చేస్తారేమో అని ఆశ్చర్యపోయింది. ఇటీవలే ప్రధాన మంత్రి బెంగళూరు పర్యటనకు వచ్చినప్పుడు రోడ్లపై గుంతలను పూడ్చడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) రూ. 23 కోట్లు ఖర్చు పెట్టింది. దీన్ని పేర్కొంటూనే కర్ణాటక హైకోర్టు పై విధంగా పేర్కొంది.

మంజుల పీ, శారదమ్మ పీలు హైకోర్టును ఆశ్రయించారు. విశ్వేశ్వరయ్య లే ఔట్‌లో తమ రెండు హౌజింగ్ సైట్లకు వాటర్, సీవరేట్ లైన్ కనెక్షన్ శాంక్షన్ అయ్యాయని, కానీ, ఇప్పటి వరకు కనెక్షన్ ఇవ్వలేదని వారు కోర్టు ముందు తెలిపారు. 2020 అక్టోబర్ 1వ తేదీన కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ వెంటనే శాంక్షన్ అయిన వాటర్, సీవరేజ్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించింది. ఆ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.

కానీ, వారిద్దరూ మళ్లీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశించినప్పటికీ నగర పాలిక అధికారులు తమకు వాటర్, సీవరేజ్ కనెక్షన్ ఇవ్వలేదని తెలిపారు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ, బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరించారని వారిద్దరూ మళ్లీ ఏడాది తర్వాత కోర్టును ఆశ్రయించారు.

జస్టిస్ బీ వీరప్ప, జస్టిస్ కేఎస్ హేమలేఖలు ఈ ధిక్కరణ పిటిషన్ విచారిస్తున్నారు. ఈ విచారణకు బెంగళూరు అధికారులు హాజరయ్యారు. ఆ పనులు పూర్తి చేయడానికి మరికొంత సమయం కావాలని కోరారు. ఈ ధిక్కరణ పిటిషన్ మే 2021 నుంచి పెండింగ్‌లోనే ఉన్నది. కానీ, బీడీఏ, బీడబ్ల్యూఎస్ఎస్‌బీ అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేసి ఆ పనులు పూర్తి చేయడంలో విఫలం అవుతూనే ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే గురువారం కర్ణాటక హైకోర్టు ఆ బెంగళూరు అధికారలపై సీరియస్ అయింది. ప్రధాని, ప్రెసిడెంట్ తరుచూ బెంగళూరు పర్యటిస్తేనే రోడ్లు పరిస్థితి మెరుగుపడతాయేమోనని పేర్కొంది. గతవారం మీరు రోడ్లపై గుంతలు పూడ్చడానికి రూ. 23 కోట్లు ఖర్చు పెట్టారని వివరించింది. అంటే.. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయాలంటే.. ప్రధాని నగరంలోని వేరు వేరు రోడ్లపై పర్యటించాల్సి ఉంటుందేమోనని మండిపడింది.

click me!