
కర్ణాటకల అసెంబ్లీ ఎన్నికలు వెలువడుతున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను రీచ్ అవుతుందా? లేదా? అనేది పూర్తి ఫలితాల తర్వాతే తెలిసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ 70 స్థానాల్లో, జేడీఎస్ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమచారం ప్రకారం దాదాపు 50 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల హోరా హోరీ పోరు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్థానాల్లో అభ్యర్థుల మధ్య కేవలం ఓట్ల తేడా 1,000 కంటే తక్కువగా ఉంది. దీంతో ఆ నియోజకవర్గాల్లో తుది ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలను ఈరోజు బెంగళూరుకు రావాలని కాంగ్రెస్ నాయకత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రిమోట్ ఏరియాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినవారిని బెంగళూరుకు తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినట్టుగా చెబుతున్నారు.
మరోవైపు బీజేపీ కూడా కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడినట్టుగా చెబుతున్నారు. బీజేపీ, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఫలితాలు ఉంటే.. ఆ దిశలో ప్రయత్నాలు సాగించాలని బీజేపీ అధిష్టానం ఇప్పటికే ప్రారంభించినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్య నేతలకు ఈరోజు సాయంత్రం బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌కు చేరుకోవాలని ఆదేశాలు వెళ్లినట్టుగా సమాచారం. అయితే ఇప్పటికే జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి అదే హోటల్‌లో ఉన్నట్టుగా సమాచారం. బీజేపీ అధినాయకత్వంలోని ముఖ్య నాయకులు కూడా కుమారస్వామితో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోతే బీజేపీ, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాల చెలరేగుతున్నాయి.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం హెచ్‌డీ కుమారస్వామి సింగపూర్ వెళ్లారు. శనివారం అర్దరాత్రి దాటిన తర్వాత ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. అయితే సింగపూర్‌లో ఉన్న సమయంలో కుమారస్వామితో కొందరు బీజేపీ ముఖ్య నేతలు మంతనాలు జరిపినట్టుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.