Karnataka election 2023: రేపు ఓట్ల లెక్కింపు.. భారీ భద్రత.. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..!

By Sumanth Kanukula  |  First Published May 12, 2023, 2:45 PM IST

కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 10వ తేదీన  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగగా.. రేపు (మే 13) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 10వ తేదీన  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగగా.. రేపు (మే 13) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ  ఏర్పడే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్ అంచనా వేయడంతో.. ఫలితం ఏ విధంగా వస్తుందనేదానిపై బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్‌ వర్గాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. మధ్యాహ్నం వరకు ఫలితంపై ఓ స్పష్టమైన చిత్రం వెలువడే అవకాశం ఉంది. 

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో.. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక, మే 10న జరిగిన ఓటింగ్‌లో రాష్ట్రంలో  రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైంది. 

Latest Videos

ఇక, కర్ణాటకలో గత 38 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని తెరదించుతూ వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఈ సారి కర్ణాటకలో అధికారంలోకి రావాలని చూస్తుంది. రెండు పార్టీలు కూడా విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 

Also Read: కర్ణాటకలో మళ్లీ హంగ్ తప్పదా?.. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందా?.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదేమిటి?

అయితే పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి రాజకీయ పార్టీలో కొత్త ఆందోళన నెలకొంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని మెజారిటీ  ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో.. బీజేపీ, కాంగ్రెస్‌లు అప్రమత్తమయ్యాయి. ఫలితాల వెల్లడికి ముందే పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోతే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా వ్యవహరించాలనే దానిపై ముందుగానే ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. మరోవైపు జేడీఎస్‌ కింగ్ మేకర్‌గా మారితే.. ఎలా వ్యవహరించాలనే దానిపై ఆ పార్టీ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. 

ఇక, 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38.04 శాతం ఓట్లు రాగా, బీజేపీ (36.22 శాతం), జేడీఎస్ (18.36 శాతం) ఓట్లు సాధించాయి. 104 స్థానాలు సాధించి బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 80 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా.. జేడీఎస్ 37 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కర్ణాటకలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో యడియూరప్ప మూడు రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది. 

ఆ తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయగా.. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఏడాదికే కుప్పకూలింది. అనంతరం బీజేపీ మళ్లీ పగ్గాలు చేపట్టింది. సీఎంగా యడియూరప్ప బాధ్యతలు చేపట్టారు. అయితే 2021 జూలైలో యడియూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

ఇక, ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 116 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 69, జేడీఎస్‌కు 29, బీఎస్పీకి 1, స్వతంత్రులు ఇద్దరు, స్పీకర్ ఒకరు, ఖాళీగా ఉన్న ఆరుగురు (మరణాలు, రాజీనామాలు) ఉన్నారు.

click me!