హోటల్‌లో రెబల్స్‌ బస: ముంబైలో డీకే శివకుమార్‌ను అడ్డుకున్న పోలీసులు

By Siva KodatiFirst Published Jul 10, 2019, 9:11 AM IST
Highlights

కర్ణాటక రాజకీయ సంక్షోభం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ చివరి ప్రయత్నాలు చేస్తుంటే... అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. 

కర్ణాటక రాజకీయ సంక్షోభం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ చివరి ప్రయత్నాలు చేస్తుంటే... అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.

ముంబైలో రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా నెలకొంది. రెబల్స్‌తో చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ముంబైలోని వారు బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్నారు.

అయితే ఆయనను హోటల్ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. తనను హోటల్ లోపలకు ఎందుకు వెళ్లనివ్వరంటూ శివకుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. భద్రత పేరుతో తమను అడ్డుకున్నారంటూ శివకుమార్ ఆరోపిస్తున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... తమ స్నేహితులను కలిసేందుకు అక్కడికి వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల్లో కలిసి పుట్టాం.. కలిసే చచ్చిపోతామని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ మధ్య ఉన్న సమస్య చాలా చిన్న సమస్య అని త్వరలోనే అది పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు.

ఉన్నపళంగా విడిపోవాలని కోరుకోవట్లేదని... అసమ్మతి ఎమ్మెల్యేలకు అపాయం కలిగిస్తామన్న ఆందోళన ఎంతమాత్రం సరికాదని.. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరినీ ప్రేమతో చూస్తున్నామన్నారు.

మరోవైపు తమకు హాని ఉందని.. సరైన భద్రత కల్పించాలంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు ముంబై పోలీస్ కమిషనర్‌‌కు లేఖ రాశారు. దీంతో వారు బస చేసిన హోటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు పెద్ద ఎత్తున కర్ణాటక ఎమ్మెల్యేలు హోటల్‌కు రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా హోటల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

జూలై 12 వరకు పోవాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితుల దృష్ట్యా బెంగళూరులో మాజీ సీఎం యడ్యూరప్ప ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు.

విధాన సౌధ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేపట్టకుండా స్పీకర్ పక్షపాతంగా వ్యవహకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 
 

click me!