కాంగ్రెస్‌కు షాక్: మనీల్యాండరింగ్‌ కేసులో డీకే శివకుమార్ అరెస్ట్

By Siva KodatiFirst Published Sep 3, 2019, 8:45 PM IST
Highlights

మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. 

మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. కోట్లలో పన్ను ఎగవేతలకు పాల్పడటంతో పాటు అక్రమ లావాదేవీలు సాగించారనే ఆరోపణలపై డీకే శివకుమార్‌తో పాటు మరికొందరిపై ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో డీకేతోపాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్‌కు చెందిన ఉద్యోగి సహా మరికొందరు పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ చేర్చింది. ఇదే కేసులో నాలుగు రోజుల క్రితం డీకేకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై శివకుమార్ భగ్గుమన్నారు. తానేమీ తప్పు చేయలేదని.. అత్యాచారం, డబ్బులు తీసుకోవడం లాంటి నేరాలకు పాల్పడలేదని ఆయన కార్యకర్తలకు తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు లేవని.. గురువారం రాత్రే ఈడీ నుంచి సమన్లు అందాయన్నారు.

భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం వుందని.. చట్టాన్ని గౌరవించి ఈడీ అధికారులకు సహకరిస్తానని శివకుమార్ స్పష్టం చేశారు. దర్యాప్తునకు హాజరవ్వాల్సిందిగా ఈడీ గతంలోనే నోటీసులు జారీ చేసింది.

వీటిని సవాల్ చేస్తూ శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో గురువారం రాత్రి ఈడీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.

click me!