‘‘ అన్న భాగ్య’’ కు అడ్డంకులు : బియ్యం అందనివ్వడం లేదు , కేంద్రంపై సిద్ధూ విమర్శలు, అంతా డ్రామానేనన్న బీజేపీ

Siva Kodati |  
Published : Jun 15, 2023, 04:05 PM IST
‘‘ అన్న భాగ్య’’ కు అడ్డంకులు : బియ్యం అందనివ్వడం లేదు , కేంద్రంపై సిద్ధూ విమర్శలు, అంతా డ్రామానేనన్న బీజేపీ

సారాంశం

అన్న భాగ్య పథకం కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. తమకు బియ్యం దొరక్కుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. 

తాము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్న భాగ్య కార్యక్రమం జరగకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం.. యాంటీ కన్నడిగ, యాంటీ పూర్ విధానాలు అవలంభిస్తోందన్నారు. రాష్ట్రానికి బియ్యాన్ని విక్రయించకుండా ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి అనుమతులు ఇవ్వడం లేదని సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ స్పందించింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డ్రామా అంటూ చురకలంటించింది.

దారిద్ర్య రేఖకు దిగువన వున్న కుటుంబాలకు చెందిన ప్రతి వ్యక్తికి, అంత్యోదయ కార్డ్ హోల్డర్‌కి జూలై 1 నుంచి 10 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందించడమే ‘‘అన్న భాగ్య’’ పథకం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారెంటీ హామీల్లో ఈ పథకం కూడా ఒకటి. కర్ణాటకలో బీపీఎల్ కుటుంబాల్లో మనిషికి ప్రస్తుతం 5 కేజీల బియ్యాన్ని ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఇతర వనరుల నుంచి బియ్యాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. పేదలకు ఇచ్చిన హామీ మేరకు బియ్యాన్ని సకాలంలో సరఫరా చేయడమే లక్ష్యంగా.. ఇతర రాష్ట్రాల నుంచి బియ్యాన్ని పొందేందుకు ప్రయత్నిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదలకు మేలు చేసే పథకాన్ని అమలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే భయంతోనే కర్ణాటక ప్రభుత్వానికి బియ్యం దొరకనీయకుండా కేంద్రం కట్టడి చేస్తోందని ఆరోపించారు. 

పేదలకు మరో 5 కిలోల ఉచిత బియ్యం అందించే పథకాన్ని కేంద్రం తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తోందని సిద్ధూ మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రం రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎఫ్‌సిఐ అధికారులు తమ వద్ద ఏడు లక్షల టన్నుల బియ్యం నిల్వలున్నాయని చెప్పారని, అయినప్పటికీ వెనక్కి తగ్గారని, దీని వెనుక ఉద్దేశం ఏంటని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఇది కార్యక్రమాన్ని అడ్డుకోవడమేనని.. బీజేపీ పేదల వ్యతిరేకి అని ఆయన ఎద్దేవా చేశారు. అయినప్పటికీ వరి పండించే రాష్ట్రాలను కర్ణాటక ప్రభుత్వం ఆశ్రయిస్తోందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణలను సంప్రదించామని, అక్కడి ముఖ్యమంత్రులతో తానే స్వయంగా మాట్లాడానని సిద్ధరామయ్య తెలిపారు. మంత్రి కెహెచ్ మునియప్ప అక్కడి నుంచి బియ్యం తెచ్చేందుకు గురువారం తెలంగాణకు వెళ్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. 

వరిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలతో పాటు, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కన్స్యూమర్స్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) నుండి కూడా బియ్యం పొందేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమైన పథకం కావడంతో తాను, మంత్రి మునియప్ప స్వయంగా ఎఫ్‌సీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌తో మాట్లాడినట్లు సీఎం తెలిపారు.

అయితే బియ్యం విషయంలో కేంద్రంపై వేలెత్తి చూపుతూ సీఎం డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉచిత బియ్యం ఇవ్వకముందే కేంద్రంపై నేరం మోపి.. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ నేత సీటీ రవి ఆరోపించారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ప్రతి నెలా ఐదు కిలోల బియ్యం ఇస్తోందన్నారు. మేనిఫెస్టో ప్రకారం బియ్యం ఇవ్వలేకపోతే.. బియ్యంతో సమానమైన డబ్బును వారి ఖాతాల్లో జమ చేయొచ్చని సీటీ రవి చురకలంటించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్