కర్ణాటక బీజేపీలో తీవ్ర అసంతృప్తి, అధిష్టానానికే అల్టిమేటం.. ఏం జరిగిందంటే?

కర్ణాటక బీజేపీలో తీవ్ర అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ఎన్నికలు జరిగి ఆరు మాసాలు పూర్తయినా ఇంకా శాసన సభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకోలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు సంధిస్తున్నారు. ప్రతిపక్ష నేతను ఎన్నుకుంటేనే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటామని అధిష్టానానికి వారు అల్టిమేటం విధించారు.
 


బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. బీఎస్ యెడియూరప్పను సీఎం సీటు నుంచి దింపేసిన తర్వాత పార్టీ క్రమంగా బలహీనపడింది. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకున్న బసవరాజు బొమ్మై ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసింది. అవినీతి ఆరోపణలే ప్రధాన అస్త్రంగా మార్చుకుని కాంగ్రెస్ భారీ మెజార్టీని సంపాదించుకుని అధికారంలోకి వచ్చింది. నిజానికి కర్ణాటకలో హిజాబ్ వంటి బీజేపీ మార్కు రాజకీయాలు పెద్దగా ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు కర్ణాటక బీజేపీలో మరో కలకలం రేగింది. ఏకంగా అధిష్టానానికే అల్టిమేటం ఇచ్చేదాకా అసంతృప్తి సెగలు కక్కుతున్నది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఆరు నెలలు గడిచినా బీజేపీ ఇప్పటికే శాసన సభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోవడం కష్టతరంగా మారిపోయింది. ఒక వేళ ప్రతిపక్ష నేతను బీజేపీ ఇంకా ఎన్నుకోకపోతే వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోమని హెచ్చరికలు చేస్తున్నారు.

Latest Videos

కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప సారథ్యంలో జరిగిన ఓ అంతర్గత సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు సమాచారం. ఎన్నికలు జరిగిన ఆరు నెలలు గడిచినా ఇంకా శాసన సభలో ప్రతిపక్ష నేతను బీజేపీ ఎన్నుకోకపోవడం దారుణం అని బీజేపీ ఎమ్మెల్యేలు ఆ భేటీలో వాపోయారు. ఇది తమకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. ఒక వేళ ఇది ఇలాగే కొనసాగితే బెలగావిలో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. 

Also Read: కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోంది.. : బీజేపీపై త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ విమ‌ర్శ‌ల దాడి

శీతాకాల సమావేశ కాలంలో బీజేపీ ఈ ప్రతిపక్ష నేతను ఎన్నుకుంటుందని, అయితే, ఆ నిర్ణయం అధిష్టానానిదే అని యెడియూరప్ప వారికి సమాధానం చెప్పినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అధిష్టానం వెంటనే నిర్ణయం తీసుకుంటుందా? లేక తాత్సారం చేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

click me!