ఒలంపిక్ విజేత కరణం మల్లీశ్వరికి కీలక పదవి..!

By telugu news teamFirst Published Jun 23, 2021, 8:07 AM IST
Highlights

ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పశ్చిమ ఢిల్లీ జిల్లీలోని ముండ్కా పట్టణంలో దేశంలోనే తొలి స్పోర్ట్స్ యూనివర్శిటీ నిర్మిస్తోంది.
 

ప్రముఖ వెయిట్ లిఫ్టర్, ఒలంపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది.   ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా కరణం మళ్లీశ్వరి నియమితులయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు.  

కాగా.. తాజాగా ఆమెను ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం తొలి వీసాగా నియమిస్తూ... ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ సంచాలకులు అజ్మిల్ హఖ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పశ్చిమ ఢిల్లీ జిల్లీలోని ముండ్కా పట్టణంలో దేశంలోనే తొలి స్పోర్ట్స్ యూనివర్శిటీ నిర్మిస్తోంది.

మరో పదేళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ కనీసం 50 పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. క్రీడాకారులు డిగ్రీ కోసం తమకు సంబంధం లేని ఏదొక కోర్సులో చేరి చదువుతుంటారు.కానీ, ఈ విశ్వవిద్యాలయంలో అలా కాకుండా క్రీడాకారులు ఏ ఆటలో అయితే, రాణించాలని ఆశిస్తారో అందులోనే డిగ్రీ చేసేలా విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నారు.

కాగా... స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆ రంగానికి చెందిన ప్రముఖులు వీసీగా ఉంటే బాగుంటుందని భావించిన ఢిల్లీ ప్రభుత్వం మల్లీశ్వరిని వీసీగా నియమించింది.

శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. అంతకుముందు వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో రెండుసార్లు స్వర్ణ పతకాలు నెగ్గడంతో కేంద్ర ప్రభుత్వం ఆమెకు 1999లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 

1997లో హరియాణాకు చెందిన సహచర వెయిట్‌ లిఫ్టర్‌ రాజేష్‌ త్యాగిని వివాహం చేసుకున్న మల్లీశ్వరి ఆ తర్వాత అక్కడే స్థిరపడింది. ఈ మధ్యే అక్కడ ఒక అకాడమీ కూడా స్థాపించి వర్థమాన వెయిట్‌ లిఫ్టర్లకు శిక్షణ కూడా ఇస్తోంది. 46 ఏళ్ల మల్లీశ్వరి ప్రస్తుతం హరియాణాలోని భారత ఆహార గిడ్డంగుల శాఖ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

click me!