
భగ్గుమంటున్న వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వ భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్ పై ఏకంగా రు.200 వరకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఇక ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందిన వారికి మరో బంఫర్ ఆఫర్ ఇచ్చింది. వారికి ఏకంగా ఒక్కో సిలిండర్ కు రూ. 400 తగ్గించింది. రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ ఇస్తున్న కానుక అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్న విషయం తెలిసింది. అయితే.. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగుమంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ.. విమర్శలు గుప్పించింది.
వంట గ్యాసు (LPG) సిలెండర్ ధరను కేంద్రం తగ్గించడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal)విమర్శించారు. ఇది ''ఉచితాల సంస్కృతి'' (revri culture) కాదా? అని ప్రశ్నించించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'మోదీజీ...ఉజ్వల్ లబ్దిదారులకు రూ.400 ఉపశమనం కల్పించడం ఉచితాల సంస్కృతి కాదా? పేదింటి ప్రజలకు ఇది ఉద్దేశించినట్టు అనుకుంటున్నాను. ఇప్పటికైనా మీరు వారిని గుర్తుంచుకున్నందుకు సంతోషం. 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మీరు వారి కోసం మరింత ఎక్కువగా ఆలోచిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ, ప్రతిపక్షాలు పేదలకు రిలీఫ్ కలిపిస్తే మాత్రం అది ఉచితాల సంస్కృతి అవుతుందా? జై హో..!" అంటూ కపిల్ సిబల్ ట్వీట్ చేసారు.
యూపీఏ 1, 2 ప్రభుత్వాల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ .. గత ఏడాది మేలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యునిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో ఎన్నికలేతర వేదిక 'ఇన్సాఫ్'ను ప్రారంభించాడు.
ఇదిలాఉంటే... ఈ నిర్ణయంతో ప్రస్తుతం దేశ రాజధానిలో 14.2 కిలోల LPG సిలిండర్ ధర రూ.1,103 ఉంటే.. కేంద్రం నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి వచ్చేసరికి దాని ధర రూ.903 లకు చేరింది. ఉజ్వల లబ్ధిదారులకు రూ .400 ల ఉపశమనం కల్పించడంతో ధర రూ.703 కు చేరుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, గృహాలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అలాగే.. ప్రభుత్వం అదనంగా 75 లక్షల ఉజ్వల కనెక్షన్‌లను అందిస్తుంది. దీని ద్వారా మొత్తం PMUY లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుంది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను మాత్రం స్థిరంగా ఉంచాయి. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం..