
కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను మే 16వ తేదీనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా వెల్లడించారు. ‘‘పార్లమెంటులో స్వతంత్ర గొంతుక చాలా ముఖ్యం. ఒక స్వతంత్ర గొంతుక మాట్లాడితే అది ఏ రాజకీయ పార్టీది కాదని ప్రజలు నమ్ముతారు’’ అని సిబల్ అన్నారు.
ఇక, కపిల్ సిబల్ కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకునిగా కొనసాగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానంపై అసమ్మతివాదుల సమూహం జీ-23లో ఆయన భాగంగా ఉన్నారు. పార్టీ నాయకత్వాన్ని మార్చాలని కపిల్ సిబల్‌తో పాటు జీ-23 నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో గాంధీల నాయకత్వంపై కపిల్ సిబల్ విమర్శలు కూడా చేశారు.
ఇదిలా ఉంటే కపిల్ సిబల్ ఇటీవల లక్నోలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. అంతేకాకుండా సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్ తరఫున సుప్రీం కోర్టులో వాదించారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత ఆజం ఖాన్‌ను సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేసింది.