
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత్రికేయుల(Journalists)కు ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్(Accreditation) గుర్తింపుపై పలు నిబంధనలు పెట్టింది. దేశ భద్రత(National Security), సార్వభౌమత్వం, సమగ్రతకు వ్యతిరేకంగా నడుచుకుంటే వారి అక్రెడిటేషన్‌ను రద్దు చేస్తామని తెలిపింది. అలాగే, నైతికంగా, హుందాగా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా నడుచుకోవాలని, లేదంటే వారి అక్రెడిటేషన్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ గైడ్‌లైన్స్ 2022ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలు మార్చింది. ఆన్‌లైన్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లకు పని చేస్తున్న జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. అయితే, న్యూస్ అగ్రిగేటర్లకు ఈ గుర్తింపు ఉండదని వివరించింది. కొత్త అక్రెడిటేషన్ విధానం ప్రకారం, ఒక జర్నలిస్టు భారత దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి, సమగ్రత్తకు వ్యతిరేకంగా విదేశాలతో స్నేహపూరితంగా లేనివారిని, అలాగే, నైతికత, హుందాతనం, శాంతి భద్రతల విషయంలో రాజీపడితే కూడా వారి అక్రెడిటేషన్‌ను క్యాన్సిల్ చేస్తామని పేర్కొంది. కోర్టు ధిక్కరించేలా, పరువునష్టం కలిగించేలా, నేరానికి ఉసిగొల్పడం వంటివి చేసేవారికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఇలాంటి జర్నలిస్టుల అక్రెడిటేషన్‌ను ఉపసంహరించుకోవడం, లేదా సస్పెండ్ చేయవచ్చని వివరించింది.
అలాగే, ఒక మీడియా సంస్థ, ఆ సంస్థలో పని చేసే జర్నలిస్టులు నకిలీ సమాచారాన్ని, లేదా తప్పుడు డాక్యుమెంట్లను ప్రచురించినట్టయితే కూడా అక్రెడిటేషన్ రద్దు అవుతుందని కేంద్రం తెలిపింది.
అలాంటి పరిస్థితుల్లో మీడియా సంస్థలు లేదా పాత్రికేయులకు అక్రెడిటేషన్ రాకుండా గరిష్టంగా ఐదేళ్ల డిబార్ చేయవచ్చని, కనిష్టంగా రెండేళ్లు అయినా డిబార్ చేయవచ్చని గైడ్‌లైన్స్ పేర్కొన్నాయి.
జర్నలిస్టులకు ప్రభుత్వ అక్రెడిటేషన్‌ను జారీ చేయడానికి, రద్దు లేదా ఉపసంహరించుకోవడం వంటి కార్యకలాపాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ కమిటీని వేయనున్నట్టు తెలిపింది. దీనికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్.. సారథ్యం వహిస్తారు. ఈ కమిటీ తొలి సమావేశం నుంచి రెండేళ్లపాటు విధులు నిర్వహిస్తుంది. ఈ కమిటీ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ అందించే పని చూసుకుంటుంది. కాగా, ఇందులోనే ఐదుగురు సభ్యులతో ఓ సబ్ కమిటీ కూడా ఉంటుంది. ఈ సబ్ కమిటీకీ ప్రిన్సిపల్ డీజీనే సారథ్యం వహిస్తారు.
చట్టాలకు లోబడి కనీసం ఒక సంవత్సరం రోజుల నుంచి రన్ అవుతూ ఉండే ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ అక్రెడిటేషన్ పొందడానికి అర్హత సాధిస్తాయని కేంద్రం తెలిపింది. అంతేకాదు, కనీసం ఆరు నెలల నెలవారీ యూనిక్ విజిటర్ల సంఖ్యను కలిగి ఉండాలని, ఆ సంఖ్యను కాగ్ అప్రూవ్ చేసిన అడిటర్లు సర్టిఫై చేసి ఉండాలని పేర్కొంది. అంతేకాదు, ఆ వెబ్ సైట్ రిజిస్టర్డ్ ఆఫీసు ఇండియాలో ఉండాలని, దాని కరస్పాండెంట్లు ఢిల్లీ లేదా నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో రిజిస్టర్డ్ ఆఫీసు కలిగి ఉండాలని వివరించింది. కాగా, దరఖాస్తుదారులు ఎక్కడైనా తప్పుడు సమాచారం ఇచ్చారని తేలితే.. అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేయడానికి వారిపై మూడేళ్లు అనర్హత వేటు పడుతుందని కేంద్రం తెలిపింది.