
రాంచీ: ఆమె క్రేన్ ఆపరేటర్ కూతురు. సివిల్స్ సాధించడానికి కఠోర శ్రమ పడింది. మొబైల్‌లో ఆన్‌లైన్ క్లాసులు వినడం, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కొనుగోలు చేసి చదవింది. అంతేకానీ, కోచింగ్ సెంటర్‌ల చుట్టూ తిరగలేదు. రోజుకు 18 గంటలు ప్రిపరేషన్‌కే కేటాయించింది. మొన్న సివిల్స్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో తానూ ర్యాంక్ సాధించినట్టు ఆమె ఫ్రెండ్ తెలిపింది. ఆల్ ఇండియా 323 ర్యాంక్ సాధించినట్టు వివరించింది. స్వయంగా ప్రిపేర్ అయి తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం నిజంగా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా కనిపించిది. ఆమె తండ్రి పడ్డ కష్టానికి ఫలితం లభించిందని అందరూ భావించారు. ఆమెను సన్మానించారు. కానీ, అసలు విషయం తర్వాత తెలిసింది. ఆమె సివిల్స్ క్రాక్ చేయలేదని స్పష్టం అయింది. మరి పొరపాటు ఎక్కడ జరిగిందంటే..!
జార్ఖండ్‌లోని రామగడ్‌కు చెందిన దివ్య పాండే (24) యూపీఎస్‌సీ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అయింది. ఆమె తండ్రి సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేశాడు. రిటైర్‌మెంట్ అయ్యాడు. దివ్య పాండేకు ఉత్తరప్రదేశ్‌లో ఒక స్నేహితురాలు ఉన్నది. ఆమె దివ్య పాండే అక్క.. ప్రియదర్శిని పాండేకు ఫోన్ చేసింది. దివ్య పాండే సివిల్స్ క్రాక్ చేసిందని ప్రియదర్శిని పాండేకు చెప్పింది. దివ్య పాండే 323వ ర్యాంక్ సాధించిందని వివరించింది. అంతే.. దివ్య పాండే ఇంటివాళ్లంత ఎగిరి గంతేసినంత పని చేశారు. అయితే.. ఆ సమాచారాన్ని వెరిఫై చేయడానికి ఇంటర్నెట్‌లో ర్యాంక్ కోసం సెర్చ్ చేశారు. కానీ, ఇంటర్నెట్ సరిగా పని చేయకపోవడంతో ఫలితాలు చూడలేకపోయారు. వారు స్వయంగా ధ్రువీకరించుకోలేదు. కానీ, దివ్య పాండే ఫ్రెండ్ చెప్పిన మాటలను విశ్వసించారు.
అదే విషయాన్ని వారి బంధుగణం, మిత్రులకు, ఆప్తులకు చేరవేశారు. ఇదే విషయం స్థానిక మీడియా వారికీ చేరింది. వారు దివ్య పాండే గురించి ప్రత్యేక కథనాలూ ప్రచురించారు. స్థానికంగా దివ్య పాండే గురించి, ఆమె ప్రేరణాత్మక స్టోరీ గురించి చర్చోపచర్చలు జరిగాయి.
ఆమె తండ్రి పని చేసిన కోల్ ఫీల్డ్ అధికారులు, చైర్మన్ ఆమెను సన్మానించారు. రామగడ్ డిప్యూటీ కమిషనర్ మాధవి మిశ్రా కూడా ఆమెను సత్కరించారు.
ఈ ఆనందంలోనే దివ్య పాండే కుటుంబం ఢిల్లీ వెళ్లింది. కానీ, అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ర్యాంక్ వచ్చింది దివ్య పాండేకు కాదని, దక్షిణ భారత్‌కు చెందిన దివ్య పి అనే అమ్మాయికి వచ్చిందని చెప్పడంతో వారి మతిపోయినంత పనైంది. చేసేదేమీ లేక నిరాశగా స్వగ్రామానికి వెనుదిరిగారు.
తమ తప్పిదాన్ని మన్నించాలని వారు మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్మానం చేసిన అధికారులను వారు కోరారు. కాగా, ఇది మానవ తప్పిదం అని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని జిల్లా అధికారులు చెప్పారు. కాబట్టి, ఆమె కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.