
JammuKashmir SI Recruitment Scam: జమ్మూ కాశ్మీర్ సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ స్కామ్‌పై దర్యాప్తునకు సంబంధించి సీబీఐ మంగళవారం దేశవ్యాప్తంగా 33 ప్రదేశాలలో సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం జమ్మూకాశ్మర్ తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. జమ్మూ , శ్రీనగర్ లతో పాటు హర్యానాలోని కర్నాల్, మహేందర్‌గర్, రేవారీ, గుజరాత్‌లోని గాంధీనగర్, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, కర్ణాటకలోని బెంగళూరులలో సోదాలు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు, డీఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారుల ప్రాంగణాల్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ JKSSB పరీక్షకు సంబంధించిన అధికారులు ఖలీద్ జహంగీర్, అశోక్ కుమార్ ప్రాంగణాలు కూడా ఉన్నాయి.
జమ్మూ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (JKSSB) మాజీ ఛైర్మన్ ఖలీద్ జహంగీర్, బోర్డ్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అశోక్ కుమార్, DSP సహా జమ్మూకాశ్మీర్ పోలీసు అధికారులు, సీఆర్పీఎఫ్ నకు చెందిన ఒక అధికారికి చెందిన ప్రాంగణాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ గత నెలలో 30 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఒక కోచింగ్ సెంటర్ యజమాని, అప్పటి బీఎస్‌ఎఫ్ మెడికల్ ఆఫీసర్, జమ్మూ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (జేకేఎస్‌ఎస్‌బీ) అధికారులతో సహా 33 మంది నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసింది. గత నెలలో జమ్మూ, శ్రీనగర్, బెంగళూరు సహా 30 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.
స్కామ్ నిందితుల్లో ఉన్నది వీరే..
జమ్మూకాశ్మీర్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసు నిందితుల్లో పాలూరాలోని బీఎస్ఎఫ్ ఫ్రాంటియర్ హెడ్‌క్వార్టర్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కర్నైల్ సింగ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు ఎఎస్‌ఐ అశోక్ కుమార్, మాజీ సీఆర్పీఎఫ్సిఅధికారి అశ్వనీ కుమార్ ఉన్నారు. వీరితో పాటు, 'ఎడ్యుమాక్స్ క్లాసెస్ అఖ్నూర్' యజమాని అవినాష్ గుప్తా, కోచింగ్ మేనేజర్ అక్షయ్ కుమార్, టీచర్ రోషన్ బ్రాల్, అప్పటి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యుడు నారాయణ్ దత్, అప్పటి జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అండర్ సెక్రటరీ బిషన్ దాస్, అప్పటి JKSSB సెక్షన్ ఆఫీసర్ నిందితుల్లో అంజు రైనా, బెంగళూరుకు చెందిన మెరిట్రాక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లు ఉన్నాయి.
ఎంటీ ఈ రిక్రూట్‌మెంట్ కుంభకోణం.. ?
జమ్మూ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ మార్చి 27న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ల పోస్టుల కోసం రాత పరీక్షను నిర్వహించింది. దాని ఫలితాలు జూన్ 4న ప్రకటించబడ్డాయి. అయితే, పరీక్షలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 33 మంది నిందితులపై ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నిందితులు జేకేఎస్‌ఎస్‌బీ, బెంగళూరుకు చెందిన ప్రైవేట్ కంపెనీ, లబ్ధిదారుల అభ్యర్థులు, ఇతర అధికారుల మధ్య కుట్ర జరిగిందని, ఎస్‌ఐ పోస్టుల రాత పరీక్ష నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయని ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.
జమ్మూ, రాజౌరి, సాంబా జిల్లాల నుంచి ఎంపికైన అభ్యర్థుల శాతం అసాధారణంగా ఎక్కువగా ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. బెంగళూరుకు చెందిన ప్రైవేట్ కంపెనీ మెరిట్రాక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రశ్నపత్రాలను సెట్ చేసే పనిని అప్పగించడంలో JKSSB నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది.