
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35ఏలు 2019లో కేంద్రం ప్రభుత్వం తొలగించింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇందులో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నది. కానీ, అప్పటి నుంచి జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు లేవు. అయితే, ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లతోపాటుగా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు వివరించాయి.
2019 తర్వాత తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇక్కడ ఐదేళ్ల ప్రభుత్వం ఏర్పడబోతుంది. గతంలో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ గడువు ఆరేళ్లుగా ఉండేది.
జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ పునర్విభజన పనులు పూర్తయ్యాయని, అక్టోబర్ 31లోపు ఓటర్ లిస్టును రివైజ్ చేస్తామని ఆ వర్గాలు వివరించాయి. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన నిర్ణయాలు తుది దశలో ఉన్నట్టు తెలిపాయి.
గతంలో జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో 87 స్థానాలు ఉండేవి. ఇందులో లడాఖ్‌కు చెందినవి నాలుగు సీట్లు ఉండేవి. కానీ, లడాఖ్ ఇప్పుడు జమ్ము కశ్మీర్ నుంచి వేరుగా ఉన్నది. అంటే.. 83 స్థానాలు జమ్ము కశ్మీర్‌లో ఉంటాయి. అయితే, ఈ అసెంబ్లీల పునర్విభజనలో ఏడు కొత్త స్థానాలు చేర్చినట్టు తెలిసింది. దీంతో జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉండబోతున్నట్టు ఈసీఐ వర్గాలు చెప్పాయి. ఇందులో జమ్ములో 43 స్థానాలు, కశ్మీర్‌లో 47 స్థానాలు ఉన్నాయి. కాగా, నాలుగు సీట్లు ఎస్టీ సీట్లు అని ఆ వర్గాలు వివరించాయి.