ఎన్నిక‌ల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌ను: గులాం నబీ ఆజాద్

Published : Sep 11, 2022, 09:44 PM IST
ఎన్నిక‌ల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌ను: గులాం నబీ ఆజాద్

సారాంశం

Ghulam Nabi Azad: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన వారాల తర్వాత తన పార్టీని ప్రారంభించబోతున్న గులాం న‌బీ ఆజాద్.. పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్న ప్రభుత్వం మాత్రమే జ‌మ్మూకాశ్మీర్ కు సంబంధించిన‌ ఆర్టికల్ 370లోని నిబంధనలను పునరుద్ధరించగలదని అన్నారు.  

Jammu and Kashmir-Article 370: జ‌మ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించి ప్రజలను తప్పుదోవ పట్టించబోమని కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆదివారం అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్న ప్రభుత్వం మాత్రమే జ‌మ్మూకాశ్మీర్ కు సంబంధించి 2019 ఆగ‌స్టులో కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన ఆర్టికల్ 370లోని నిబంధనలను పునరుద్ధరించగలదని అన్నారు. కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన తర్వాత కాశ్మీర్‌లో జరిగిన తొలి ర్యాలీలో ఆయన ప్రసంగించారు. "ఏమి చేయవచ్చో, ఏమి చేయలేదో ఆజాద్‌కు తెలుసు. నేను లేదా కాంగ్రెస్ పార్టీ లేదా మూడు ప్రాంతీయ పార్టీలు మీకు ఆర్టికల్ 370ని తిరిగి ఇవ్వలేవు. (TMC చీఫ్) మమతా బెనర్జీ లేదా DMK లేదా (NCP చీఫ్) శరద్ పవార్ కూడా మీకు జ‌మ్మూకాశ్మీర్ ప్ర‌త్యేక హోదాను తిరిగి ఇవ్వలేరు" అని ఆజాద్ అన్నారు.

రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడైన గులాం న‌బీ ఆజాద్.. తనకు నియంత్రణ లేని నినాదాలు లేదా సమస్యలను లేవనెత్తనని అన్నారు. ఉత్తర కాశ్మీర్‌లోని డాక్ బంగ్లా బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. "నేను ఆర్టికల్ 370 గురించి మాట్లాడనని కొందరు అంటున్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం గులాం న‌బీ ఆజాద్ ప్రజలను మోసం చేయరని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను" అని అన్నారు. తన కొత్త పార్టీ గురించి మాట్లాడుతూ.. త‌న కొత్త పార్టీ స్వతంత్ర భావజాలాన్ని కలిగి ఉంటుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, దాని ప్రజలకు ఉద్యోగాలు, ఇక్క‌డివారి భూమిపై ప్రత్యేక హక్కులు కల్పించడంపై తమ పార్టీ దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా ఆజాద్ ఓటు వేశారని అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీపై ఆయన మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు కోసం హోం మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నేను ఓటు వేశానని గులాం న‌బీ ఆజాద్ తెలిపారు.

"1990 నాటి విషాదం..  కాశ్మీరీ పండిట్లు, ముస్లింలు, సిక్కులతో సహా ప్రతి ఒక్కరి ప్రాణాలను తీసింది. చాలా మంది కాశ్మీరీ పండిట్లు పారిపోవాల్సి వచ్చింది. కాశ్మీర్ భారీగా నష్టపోయింది. ఆ సమయంలో ప‌లు బూటకపు ఎన్‌కౌంటర్లు కూడా జరిగాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మానవ హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఉగ్రవాదులను హతమార్చడంపై ఎలాంటి అల‌స్యం జ‌ర‌గ‌లేదు" అని గులాం న‌బీ ఆజాద్ అన్నారు. త‌న ప్ర‌సంగంలో కాంగ్రెస్ పార్టీ పై కూడా ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్‌కు 50 సీట్లకు మించి రాలేదన్నారు.  మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను" అని నేతాజీ అన్న‌ట్లుగా  "మీరు నాకు మీ రక్తం ఇవ్వండి, నేను మీకు రక్తం ఇస్తాను" అని జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తాను చెప్పాలనుకుంటున్నాన‌ని తెలిపారు. 'నేను ప్రతిపక్ష నాయకుడిని కాకపోతే, పార్లమెంటులో కాశ్మీర్ గురించి ఎవరూ లేవనెత్తరు' అని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే