
జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన నివేదిక విడుదలైంది. నియోజకవర్గాల పునర్విభజన తుది నివేదికపై ముగ్గురు సభ్యులతో కూడిన డిలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది. డీలిమిటేషన్ కోసం రూపొందించిన తుది నివేదికను విడుదల చేసింది. నివేదికను నోటిఫై చేసి ప్రభుత్వానికి సమర్పించింది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలు ఉన్నాయి. దీంతో జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అయితే కరోనా మహమ్మారి కారణంగా.. కమిషన్ తన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోయింది. ఈ కారణంగా కమిషన్ పదవీకాలం రెండుసార్లు పొడిగించబడింది. కమిషన్ సభ్యులు తమ రెండేళ్ల పదవీ కాలంలో జమ్మూ కాశ్మీర్‌కు రెండుసార్లు వెళ్లారు. అక్కడ సాధారణ ప్రజలతో పాటు రాజకీయ, సామాజిక, మతపరమైన సంస్థల నుంచి సూచనలు తీసుకున్నారు. ఇక, కమిషన్ గడువు మే 6వ తేదీన ముగియనుండగా.. ఒక రోజు ముందు నేడు అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై రూపొందించిన తుది నివేదికను కమిషన్ విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభలో మొత్తం సీట్లు 90 ఉంటాయి. వీటిలో కాశ్మీర్ డివిజన్‌లో 47 సీట్లు, జమ్మూ డివిజన్‌లో 43 సీట్లు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా షెడ్యూల్డ్ తెగలకు 9 సీట్లను ప్రతిపాదించారు. గతంలో పోలిస్తే.. జమ్మూలో కొత్తగా ఆరు సీట్లు, కాశ్మీర్ ఒక సీటును కమిషన్ ప్రతిపాదించింది. గతంలో కాశ్మీర్ డివిజన్‌లో 46 సీట్లు ఉండగా ఇప్పుడది 47కు, జమ్మూ డివిజన్‌లో 37 సీట్లు ఉండగా.. డీలిమిటేషన్ తర్వాత 43కు పెరిగాయి. ఇక, రియాసి జిల్లాలోని 58వ సంఖ్య అసెంబ్లీకి శ్రీ మాతా వైష్ణో దేవి అని పేరు పెట్టారు. ఇక, కాశ్మీరీ పండిట్‌లు, నిర్వాసితులకు అసెంబ్లీలో అదనపు సీట్లను కమిషన్ సిఫార్సు చేసింది.
డీలిమిటేషన్ తర్వాత కొత్తగా ఓటరు జాబితాను సిద్ధం చేసిన తర్వాత ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. జమ్మూకశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ సభ్యులుగా ఉన్నారు. ఆ నివేదిక ప్రకాశం.. మొత్తం సీట్లు: 90, కాశ్మీర్ డివిజన్‌లో సీట్లు : 47, జమ్మూ డివిజన్‌లో సీట్లు : 43 ఉండనున్నాయి. వీటిలో ఎస్సీలకు- 07, ఎస్టీలకు- 09 సీట్లు కేటాయించారు.
ఇక, జమ్మూ కాశ్మీర్‌లో చివరిగా 1995లో డీలిమిటేషన్ జరిగింది. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో 12 జిల్లాలు, 58 తహసీల్‌లు ఉండేవి. ప్రస్తుతం అక్కడ 20 జిల్లాలు, 270 తహసీల్‌లు ఉన్నాయి. 1981 జనాభా లెక్కల ఆధారంగా చివరి డీలిమిటేషన్ జరిగింది. ఈసారి డీలిమిటేషన్ కమిషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టింది.