Omicron: విదేశీ ప్రయాణికులకు ఊరట.. ఐసొలేషన్ తప్పనిసరి కాదు.. కేంద్రం సవరించిన నిబంధనలు ఇవే

By Mahesh KFirst Published Jan 21, 2022, 2:03 PM IST
Highlights

విదేశీ ప్రయాణికులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో కొంత సడలింపు తెచ్చింది. గురువారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ ఐసొలేషన్ తప్పనిసరి కాదని పేర్కొంది. మన దేశంలోకి దిగగానే పాజిటివ్ అని తేలితే.. నిబంధనల ప్రకారం ట్రీట్ మెంట్ అందించి ఐసొలేషన్‌లో ఉంచాలి. ఏడు రోజుల క్వారంటైన్ తర్వాతే ఎనిమిదో రోజు ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవాలి.
 

న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు మూడున్నర లక్షల కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు సాధారణంగా మరింత కఠినం చేయాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చేలా నిబంధనలు సవరించింది. మన దేశంలో దిగగానే వారికి కరోనా పాజిటివ్ వచ్చినా.. నెగెటివ్ వచ్చినా.. తప్పనిసరిగా ఏడు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలని ప్రస్తుత ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, తాజాగా కరోనా పాజిటివ్  తేలిన విదేశీ ప్రయాణికులను ఐసొలేషన్ ఫెసిలిటీలో ఉంచడం తప్పనిసరి కాదని వెల్లడించింది.

ఒమిక్రాన్ వేరియంట్ రిస్క్ దేశమైనా.. రిస్క్ లేని దేశమైనా సరే.. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు మన దేశంలో అడుగు పెట్టగానే ఒక వేళ కరోనా పాజిటివ్ అని తేలినా.. నిర్దేశిత నిబంధనల ప్రకారం ట్రీట్‌మెంట్ అందించాలని గురువారం విడుదల చేసిన మార్గదర్శకాలు తెలిపాయి. నిర్దేశిత నిబంధనల ప్రకారం ట్రీట్‌మెంట్ అందించాలని, ఆ నిబంధనల ప్రకారమే ఐసొలేషన్ ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. అంతేకానీ, అందరికీ ఐసొలేషన్ తప్పనిసరి కాదని సవరించిన గైడ్‌లైన్స్ పేర్కొంటున్నాయి.  విదేశాల నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా ఐసొలేషన్ ఫెసిలిటీలో మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.

గురువారం విడుదలైన ఈ నిబంధనలు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది. అయితే, మిగిలిన నిబంధనలు అన్నీ ఈ సవరించిన గైడ్‌లైన్స్‌లోనూ ఉంటాయని తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా ఐసొలేషన్ ఫెసిలిటీలో ఉండాలనే మాట.. ఈ సవరించిన గైడ్‌లైన్స్‌లో లేదు. స్క్రీనింగ్ చేస్తుండగా ఎవరైనా ప్రయాణికుడికి కరోనా లక్షణాలు కనిపిస్తే.. హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం, సదరు వ్యక్తిని వెంటనే ఐసొలేట్ చేసి మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్లాలి. ఒక వేళ అతనికి కరోనా పాజిటివ్ అని తేలితే.. వెంటనే ఆయన కాంటాక్టులను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టాలి.

అయితే, విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ అని తేలితే.. ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో గడపాల్సిన నిబంధనలు అలాగే ఉన్నాయి. ఒక వేళ వారికి మధ్యలో కరోనా నెగెటివ్ అని వచ్చినా.. ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఎనిమిదో రోజు ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవాలి.

తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు 4 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,20,215 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,207 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,22,403కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో (corona deaths in telangana) వైరస్ వల్ల మరణించిన సంఖ్య 4,067కి చేరింది. కోవిడ్ నుంచి నిన్న 1,825 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 26,633 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1645 కేసులు నమోదయ్యాయి.  

click me!