సుప్రీంకోర్టు ఆశ్రయించిన ఇష్రత్ జహాన్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు పోలీసు అధికారి.. ఎందుకంటే?

By Mahesh KFirst Published Sep 13, 2022, 10:50 PM IST
Highlights

ఇష్రత్ జహాన్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు చేసిన ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరో నెల రోజుల్లో రిటైర్‌మెంట్ కాబోతున్న సమయంలో కేంద్ర హోం శాఖ ఆయనను డిస్మిస్ చేసింది. డిస్మిస్ అయితే.. ఆయనకు పెన్షన్ సహా ఇతర బెనిఫిట్లు అందవు.
 

న్యూఢిల్లీ: గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సతీష్ చంద్ర వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన రిటైర్‌మెంట్ మరో నెలలో ఉండగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయనను డిస్మిస్ చేసింది. ఇష్రత్ జహాన్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సంస్థకు ఆయన సహకారం అందించారు. 

ఐపీఎస్ అధికారి సతీష్ చంద్ర వర్మను ఆగస్టు 30న డిస్మిస్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు పంపింది. ఆయన సెప్టెంబర్ 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉన్నది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 19వ తేదీ వరకు ఆయనకు అందుబాటులో ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని హైకోర్టు సూచించినట్టు కేంద్ర హోం శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.

హైకోర్టు జారీ చేసిన రెండు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ సెప్టెంబర్ 16న జరగనుంది.

ఒక వేళ కేంద్ర హోం శాఖ జారీ చేసినట్టుగా డిస్మిస్ చేస్తూ.. ఆయనకు రావాల్సిన పెన్షన్, ఇతర బెనిఫిట్లు రావు. 

సతీష్ వర్మపై డిపార్ట్‌మెంటల్ ప్రొసీడింగ్స్ జరిగాయి. అందులో ఒక ఆరోపణ.. ఆయన మీడియాతో మాట్లాడి దేశ అంతర్జతీయ సంబంధాలను దెబ్బతీశాడనేది ఒకటి. డిపార్ట్‌మెంటల్ కేసుల కారణంగా గుజరాత్ ప్రభుత్వం ఆయన ప్రమోషన్‌ను కూడా వ్యతిరేకించింది.

1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వర్మ ఐజీపీగా సేవలు అందిస్తుండగా ఆయన జూనియర్లు (1987 బ్యాచ్, ఇతర బ్యాచ్ వాళ్లు) డీజీపీ ర్యాంక్ హోదాలో పని చేస్తున్నారు. వర్మ ప్రస్తుతం కోయంబత్తూర్‌లోని సీఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ స్కూల్‌లో డైరెక్టర్‌గా చేస్తున్నారు.

గుజరాత్ సహా దేశంలోనే సంచలనంగా మారిన ఇష్రత్ జహాన్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తులో సతీష్ వర్మ అధికారిగా ఉన్నారు. తొలుత ఆయన గుజరాత్ హైకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తునకు ఆయనే సారథ్యం వహించారు. ఆ సమయంలో ఆయన అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో సూటిగా, ఘాటుగా వ్యవహరించారు.

2014లో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తాను ఇష్రత్ జహాన్ కేసు దర్యాప్తు చేసిన కాబట్టే 2010, 11 కాలం నుంచి తనను టార్గెట్ చేస్తున్నారని, అందుకే ఆకస్మికంగా తనను ఈశాన్య రాష్ట్రాలకు సెంట్రల్ డిప్యుటేషన్ మీద పంపించారని ఆరోపించారు. అక్కడ ఆయన నార్త్  ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌ చీఫ్ విజిలెన్స్ అధికారిగా వెళ్లినాక అరుణాచల్ ప్రదేశ్‌లోని హైడ్రో పవర్ ప్రాజెక్టులో పెద్ద మొత్తంలో అవకతవకాలు జరుగుతున్నాయని అప్పటి రాష్ట్ర హోం మంత్రి కిరణ్ రిజిజు (ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ మంత్రి), ఆయన బంధువులు, అధికారులపై రిపోర్టు ఇచ్చారు.

click me!