తాలిబాన్లు టెర్రరిస్టులా? కాదా?.. కేంద్ర ప్రభుత్వానికి కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నలు

By telugu teamFirst Published Sep 1, 2021, 8:51 PM IST
Highlights

తాలిబాన్లతో భారత ప్రభుత్వం చర్చ జరపడాన్ని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఆక్షేపించారు. తాలిబాన్ టెర్రరిస్టు సంస్థనా? కాదా? అని నిలదీశారు. తాలిబాన్‌పై కేంద్ర ప్రభుత్వం వైఖరి వెల్లడించాలని, సరైన దృక్పథాన్ని ఏర్పరుచుకోవాలని సూచించారు.
 

న్యూఢిల్లీ: ఖతర్‌లో తాలిబాన్లతో భారత్ చర్చ ప్రారంభించిన నేపథ్యంలో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. తాలిబాన్లు టెర్రరిస్టులా? కాదా? అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం వారిని ఏ దృష్టితో చూస్తున్నదని ప్రశ్నించారు. దయచేసి తమకు వెల్లడించాలని కోరారు.

‘తాలిబాన్ ఉగ్రవాద సంస్థనా? కాదా? కేంద్ర ప్రభుత్వం తాలిబాన్లను ఎలా చూస్తున్నదో వెల్లడించాలి. ఒకవేళ ఇది ఉగ్రవాద సంస్థ కాకుంటే ఐరాసలో దాన్ని ఉగ్రవాద సంస్థల నుంచి తొలగించాలని ప్రతిపాదించండి. వారి బ్యాంకు ఖాతాలపైనున్న ఆంక్షలు ఎత్తేయడానికి చర్యలు తీసుకోండి. వారిని మరోవిధంగా చూడకుండా చేయండి’ అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. 

‘తాలిబాన్ ఉగ్రవాద సంస్థనే అయితే, వారితో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మరి వారిది ఉగ్రవాద సంస్థ కాకుంటే వారి బ్యాంకు ఖాతాలను ఎందుకు నిషేధిస్తున్నారు? వారి ప్రభుత్వాన్ని మీరెందుకు గుర్తించరు? ముందు మీ ఆలోచనా విధానాన్ని సరిచేసుకోండి’ అని కేంద్రంపై విమర్శలు కురిపించారు. తాలిబాన్లతో చర్చ జరపడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ కదా.. వారితో చర్చ జరపడమేంటని ప్రశ్నించారు.

ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్‌కు వ్యతిరేకంగా వాడకుండా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం తాలిబాన్‌కు తెలియజేసిన సంగతి తెలిసిందే.

click me!