
ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణాల కేసులు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. ఒకప్పుడు వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మాత్రమే.. గుండెపోటుతో మరణించేవారని భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్తితి పూర్తిగా మారిపోయింది. యువత కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. అలాగే.. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు. ఎల్లప్పుడూ.. ఫిట్ గా ఉండి, జిమ్ చేస్తున్న వారు సైతం కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్ లో అలాంటి ఉదంతం ఒకటి తెరపైకి వచ్చింది. ఇక్కడ ఒక హోటల్ యజమాని జిమ్‌లో గుండెపోటుతో మరణించాడు. కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకున్నారు. దీంతో జిమ్‌కు వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. అదే సమయంలో జిమ్‌లో గుండెపోటు కేసులు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది.
వివరాల్లోకెళ్తే.. ఇండోర్ లోని గోల్డ్ జిమ్‌లోహోటల్ బృందావన్ యజమాని ప్రదీప్ రఘువంశీ గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు రెగ్యూలర్ గా జిమ్ కు వెళ్లే అలవాటు ఉంది. జిమ్ లో చాలా సేపు గడిపేవారు .ఎప్పటిలాగే గురువారం కూడా జిమ్ కు వెళ్లాడు. ట్రెడ్‌మిల్ పై నడిచాడు. తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ మరుక్షణమే చూస్తుండగానే.. నేల మీద కుప్పకూలాడు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న కొందరు యువకులు వెంటనే ప్రదీప్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ నెల 18న ప్రదీప్ కొడుకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రదీప్ జిమ్ లో వ్యాయమం చేస్తూ కుప్పకూలి చనిపోవడం.. ఇదంతా జిమ్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిమ్ చేసే వారు సైతం ఇలా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగించే అంశం.