మిలిటరీ కోసం అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశాలు ఇవే.. ఇండియా ప్లేస్ ఇదే

Published : Apr 25, 2022, 01:14 PM IST
మిలిటరీ కోసం అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశాలు ఇవే.. ఇండియా ప్లేస్ ఇదే

సారాంశం

కరోనా ఆర్థికంగా కుదేలైనా.. అనేక సమస్యలు ఎదురైనా మిలిటరీ ఖర్చుల్లో మాత్రం ప్రపంచదేశాలు వెనుకడుగు వేయలేదని స్పష్టం అవుతున్నది. అంతేకాదు, సిప్రి విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచదేశాలు గరిష్టంగా మిలిటరీ కోసం ఖర్చు పెట్టాయి. 2021లో 2.1 ట్రిలియన్ డాలర్లు మిలిటరీకి ఖర్చు పెట్టాయి. ఇందులో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో చైనా, భారత్, యూకే, రష్యాలు ఉన్నాయి.  

న్యూఢిల్లీ: ఒకప్పుడు రాజ్యవిస్తరణ కాంక్షతో యుద్ధాలు జరిగేవి. ఆ తర్వాత సామ్రాజ్యవాదంతో ఈ యుద్ధాలు జరిగాయి. కొన్నిసార్లు భావజాల వ్యాప్తి కోసం కూడా జరిగాయి. ఆ తర్వాత మార్కెట్లు, ఆర్థిక కారణాలు, ఎగుమతులు, దిగుమతులే ప్రధాన కారణంగా యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు పూర్తిగా ఎగుమతులపై ఆధారపడుతుండగా.. కొన్ని దేశాలు దిగుమతుల్లేకుండా మనుగడ సాధించడం కష్టంగా ఉన్నాయి. మరికొన్ని దేశాలు స్వావలంబన సాధించుకున్నాయి. ఇలాంటి విభిన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు విభేదాలు యుద్ధాల వరకు చేరుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ పెరుగుతున్నది. దీనికి తోడు ఆయుధాలు కూడా ఒకరకమైన వ్యాపారమార్గంగా మారడంతో ప్రపంచ దేశాలు మిలిటరీ ఖర్చులను పెంచుకుంటున్నాయి.

కొన్నేళ్లుగా మిలిటరీ కోసం అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలుస్తున్నది. తాజాగా, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) విడుదల చేసిన నివేదికలోనూ అమెరికానే టాప్‌లో ఉన్నది. కాగా, ఆ తర్వాతి దేశాల జాబితాలో చైనా, భారత్ ఉన్నది. అంటే ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ కోసం అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నది. భారత్ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ కింగ్‌డమ్, ఆ తర్వాత రష్యా ఉన్నది.

మొత్తంగా చూసుకుంటే మిలిటరీ కోసం ప్రపంచ దేశాల ఖర్చు పెరిగింది. కరోనా మహమ్మారితో కుదేలైనప్పటికీ కొంత తెమలాయో లేదో మిలిటరీ కోసం భారీ కేటాయింపులు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 2021లో 2.1 (2113 బిలియన్ డాలర్లు) ట్రిలియన్ డాలర్ల ఖర్చులు మిలిటరీ కోసం ఖర్చు చేశాయి. మిలిటరీ ఖర్చుల్లో 0.7 శాతం పెరుగుదల కనిపించింది. కాగా, ఇందులో టాప్ ఐదు దేశాలు అంటే అమెరికా, చైనా, ఇండియా, యూకే, రష్యా దేశాలే 62 శాతం మిలిటరీ కోసం ఖర్చు పెట్టాయి.

2020లో ప్రపంచ జీడీపీలో మిలిటరీ ఖర్చులు 2.3 శాతంగా ఉన్నాయి. కాగా, 2021లో ఇది 2.2 శాతానికి కాస్త తగ్గింది. జీడీపీ శాతంలో తగ్గినప్పటికీ మొత్తంగా ఖర్చులు చూస్తే మాత్రం మిలిటరీకి పెరిగాయని తెలుస్తున్నది.

అమెరికా మిలిటరీ ఖర్చులు 2021లో 801 డాలర్లుగా ఉన్నది. 2020తో పోల్చితే 1.4 శాతం తక్కువగా ఉన్నది. కాగా, 2012 నుంచి 2021 మధ్య కాలంలో అమెరికా తన మిలిటరీ ఖర్చులను 24 శాతం పెంచడం గమనార్హం. కాగా, ఆయుధాల కొనుగోళ్లలో 6.4 శాతం కుదించినట్టు సిప్రి రిపోర్టు తెలిపింది.

రెండో స్థానంలో ఉన్న చైనా మాత్రం డిఫెన్స్ కోసం 293 బిలియన్ డాలర్లను ఖర్చుపెట్టింది. 2020తో పోల్చితే 2021లో ఇది 4.7 శాతం పెరిగింది. కాగా, మూడో స్థానంలో ఉన్న భారత్ గతేడాది 76.6 బిలియన్ డాలర్లను మిలిటరీ కోసం ఖర్చు పెట్టింది. 2020తో పోల్చితే 0.9 శాతం మేరకు మిలిటరీ కోసం ఖర్చులను పెంచింది. అదే 2012 సంవత్సరంతో పోల్చితే మిలిటరీ ఖర్చులు 33 శాతం పెంచింది. యూకే గతేడాది 68.4 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. 2020 కంటే మూడు శాతం పెంచుకుంది. కాగా, రష్యా 65.9 శాతం మిలిటరీకి ఖర్చు పెడుతున్నది. 2020 కంటే 2.9 శాతం పెంచుకుంది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం