
న్యూఢిల్లీ: 2019లో దుబాయ్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ. 11 కోట్ల పరిహారం ప్రకటించారు. ఆ ప్రమాదంలో 17 మంది మరణించారు. అందులో 12 మంది భారతీయులు ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ భారతీయుడు ముహమ్మద్ బేగ్ మిర్జాకు తాజాగా రూ. 11 కోట్ల (5 మిలియన్ల దిర్హమ్) పరిహారం అందించేలా కోర్టు ఆదేశించింది.
మిర్జా 20 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్. ఒమన్ నుంచి యూఏఈకి బస్సులో వెళ్లుతుండగా దుబాయ్‌లో ప్రమాదం జరిగింది. ఓవర్‌హెడ్ హెయిట్ బారియర్‌ను బస్సు ఢీకొట్టడంతో లెఫ్ట్ సైడ్ ఎగువ పోర్షన్ మొత్తం ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 17 మంది మరణించారు. ఆ 17 మందిలో 12 మంది భారతీయులేనని ఖలీజ్ టైమ్స్ న్యూస్‌పేపర్ రిపోర్ట్ చేసింది.
బస్సు డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. బాధిత కుటుంబాలకు అందించడానికి 3.4 మిలియన్‌ల దిర్హమ్ చెల్లించాలి కోర్టు ఆదేశించింది.
మిర్జా లాయర్లు అందించిన సమాచారం ప్రకారం, మిర్జాకు ఒక మిలియన్ దిర్హమ్‌లు అందించాలని యూఏఈ ఇన్సూరెన్స్ అథారిటీ తొలుత నిర్ణయించింది. దీంతో పిటిషనర్లు దుబాయ్ కోర్టును ఆశ్రయించారు. ఈ పరిహారాన్ని 5 మిలియన్ల దిర్హమ్‌కు పెంచుతూ ఆ కోర్టు ఆదేశించింది.
Also Read: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు.. రేపు ఉదయం జైలు నుంచి బయటకు!
సెలవులను బంధువులతో గడిపిన తర్వాత మస్కట్ నుంచి బయల్దేరి వస్తుండగా మిర్జాకు ఈ ప్రమాదం జరిగింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. దుబాయ్ హాస్పిటల్‌లో ఆయన సుమారు రెండు నెలలు చికిత్స పొందాడు. అందులో 14 రోజులు అపస్మారక స్థితిలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత కూడా చాన్నాళ్లు రిహాబిలిటేషన్‌లో ఉండాల్సి వచ్చింది. ఈ ప్రమాదం కారణంగా ఆయన తన చదువులను పూర్తి చేయలేకపోయాడు.
ఈ ప్రమాదంలో మిర్జాకు మెదడు డ్యామేజీ అయింది. కాబట్టి, అతను తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని వైద్యులు చెప్పారు. మిర్జాకు పుర్రె, చెవులు, నోరు, ఊపరితిత్తులు, చేతులు, కాళ్లకు తగిలిన గాయాలను ఫోరెన్సిక్ మెడికల్ నిపుణులు పరీక్షించారు. మిర్జా మెదడుకు సగం మేరకు శాశ్వతంగా డ్యామేజీ జరిగిందని ఈ రిపోర్టు తెలిపింది. దీని ఆధారంగానే యూఏఈ సుప్రీంకోర్టు.. ఆయనకు నష్టపరిహారాన్ని పెంచింది.